వ్యాక్సిన్లపై భారతీయుల స్పందన ఏమిటీ? | Coronavirus: Indian Politics On Vaccination | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్లపై భారతీయుల స్పందన ఏమిటీ?

Dec 14 2020 6:42 PM | Updated on Dec 14 2020 8:24 PM

Coronavirus: Indian Politics On Vaccination - Sakshi

సురక్షితం, సమర్థమైనవన్న పదాలకు ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్న నిర్వచనాలే సరిగ్గా లేవని వాదిస్తున్న వారు కూడా నాడు ఉన్నారు, నేడూ ఉన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే పలు వ్యాక్సిన్లు భారత్‌ ముంగిట్లోకి వస్తున్న నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించిన విషయం తెల్సిందే. అయితే ఈ వ్యాక్సిన్లను ఎంత మంది తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారన్నది ప్రస్తుత ప్రశ్న. భారత్‌లోని జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా తాము తొందరపడి వ్యాక్సిన్‌ తీసుకునే ఉద్దేశం లేదని దేశవ్యాప్తంగా ‘లోకల్‌ సర్కిల్స్‌’ ఇటీవల నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 60 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. 

వ్యాక్సిన్లు ‘సురక్షితం, సమర్థమైనవి (సేఫ్‌ అండ్‌ ఎఫెక్టివ్‌)’ అని తొలి వ్యాక్సిన్‌ పుట్టిన నాటి నుంచి భారత ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నప్పటికీ నమ్మని వారు, ఆసక్తిలేని వారు, పైగా వ్యతిరేకిస్తున్నవారు నాడు ఉన్నారు. నేడూ ఉన్నారు. వాటి వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సురక్షితం, సమర్థమైనవన్న పదాలకు ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్న నిర్వచనాలే సరిగ్గా లేవని వాదిస్తున్న వారు కూడా నాడు ఉన్నారు, నేడూ ఉన్నారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కొన్నేళ్లు పట్టేవి. ఈసారి ఏడాది కాలానికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
(చదవండి: వైద్యుడు కాదని వ్యాక్సిన్‌ను నమ్మలేదు.. కానీ)

కరోనా వైరస్‌ ప్రాణాంతకమనడం ఒట్టి ట్రాష్‌ అని, జలుబూ, దగ్గూ కలిగించే వైరస్‌ లాంటిదే ఈ కరోనా వైరస్‌ అని ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయంగా సొమ్ము చేసుకునేందుకు కొన్ని ఫార్మా కంపెనీలు సష్టిస్తున్న కథనాల పర్యవసానమే ప్రజల భయాందోళనలకు కారణమని విమర్శిస్తున్న మేధావులూ ఉన్నారు. ‘ఏడాది కాలంలో కొన్ని పరిమిత సంఖ్యలో ప్రజలపై పరీక్షలు జరిపి వ్యాక్సిను సురక్షితమని చెప్పడం ఎంత మాత్రం సబబు కాదు’ అని బెంగాల్‌కు చెందిన ప్రముఖ గ్రామీణ డాక్టర్‌ ప్రబీర్‌ ఛటర్జీ వ్యాఖ్యానించారు. జాతీయ పోలియో టీకా కార్యక్రమంలో ఆయన వివిధ హోదాల్లో  పని చేశారు.

కరోనా టీకా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రభుత్వాలు హేతుబద్ధమైన వైఖరి అవలంబించడం మంచిదని ముంబైకి చెందిన ప్రజారోగ్య పరిశోధకులు, జర్నలిస్టు సంధ్యా శ్రీనివాసన్‌ అభిప్రాయపడ్డారు. వేచి చూడ్డం ఒక్కటే ప్రస్తుతం మనముందున్న మార్గమని ఆమె వ్యాఖ్యానించారు. ‘వ్యాక్సిన్‌ పరిశోధనల గురించి మన ప్రభుత్వాలు ఎప్పుడూ వాస్తవాలు చెప్పక పోవడం వల్లన వ్యాక్సిన్ల పట్ల భయాలుగానీ, అపోహలుగానీ పోవు’ అని చెన్నైకి చెందిన కమ్యూనిటీ మెడిసిన్‌ ఫిజీషియన్‌ విజయ్‌ప్రసాద్‌ గోపి చంద్రన్‌ అభిప్రాయపడ్డారు. 
(చదవండి: రానున్న 4-6 నెలలు జాగ్రత్త: బిల్‌ గేట్స్)

వ్యాక్సిన్లను సమర్థించిన భారతీయ నేతలు
అన్ని అంటు రోగాలకు వ్యాక్సిన్లను రూపొందించడమే అన్నింటికన్నా ఉత్తమ మార్గమని భారత విధాన నేతలు, నిర్ణేతలు మొదటి నుంచి నమ్ముతూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, మార్గదర్శకాలను భారత ప్రభుత్వాలు గుడ్డిగా నమ్ముతూ వచ్చాయని ‘ది పాలిటిక్స్‌ ఆఫ్‌ వ్యాక్సినేషన్‌: ఏ గ్లోబల్‌ హిస్టరీ’ అనే పుస్తకంలో ప్రముఖ చరిత్రకారుడు నీల్స్‌ బ్రిమ్‌నెస్‌ అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ‘వ్యాక్సిన్‌’ ఆలోచనను జాతిపిత మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారు. మనతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అన్నింటికన్నా ముఖ్యమని అన్నారు. 

టీబీకి తీసుకొచ్చిన బీసీజీ వ్యాక్సిన్‌ను సీ రాజగోపాలాచారి తీవ్రంగా వ్యతిరేకించారు. పాశ్యాత్య దేశాల ప్రయోజనాల కోసం వ్యాక్సిన్ల పేరిట ప్రయోగాల కోసం భారతీయులను ఉపయోగించుకుంటున్నారన్నది ఆయన వాదన. ఇంకా దేశంలో కొన్ని రాష్ట్రాల వారు, కొన్ని మతాల వారు, కొన్ని కులాల వారు వ్యాక్సిన్లను వ్యతిరేకించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. నాటి సంగతులను పక్కన పెడితే కరోనా వైరస్‌కు టీకాలు ఎప్పుడు వస్తాయా! అంటూ ఆతతతో ఎదురుతెన్నులు చూస్తున్న భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 
(చదవండి: వ్యాక్సిన్‌ వద్దా.. లాక్‌డౌనే ముద్దా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement