ఆ ఎయిర్‌ లైన్స్‌, ఎయిర్‌పోర్ట్‌లకి భారీ షాక్‌! ప్రయాణికుడి పట్ల అలా వ్యవహరించడంతో..

Consumer Court Ordered Bengaluru Airport IndiGo Ordered To Pay Rs 12 Lakh  - Sakshi

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి వినియోగదారుల కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ఓ ప్రయాణికుడి సంరక్షణ విషయంలో అలా వ్యవహరించినందుకు చురకలంటిస్తూ భారీగా నష్ట పరిహారం చెల్లించమని ఆదేశించింది కోర్టు. ఈ ఘటన బెంగుళూరు కెంపెగోద్వా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

అసలేం జరిగందంటే.. నవంబ్‌ 2021లో చంద్ర శెట్టి అనే ప్రయాణికుడు అతడి కుటుంబం మంగళూరులోని తమ స్వగ్రామానికి వెళ్లడం కోసం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానకి చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే అనూహ్యంగా శెట్టి నేలపై కుప్పకూలిపోయారు. అదే సమయంలో అతని పక్కనే ఉన్న భార్య సుమతి, కూతురు దీక్షిత విమానాశ్రయ సిబ్బందిని, ఎయిర్‌పోర్టు అధికారులను సాయం చేయమని కోరారు. అయితే వారంతా బాధితుడికి సహాయం చేయడంలో విఫలమయ్యారు. కనీసం అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు కనీసం వీల్‌చైర్‌ కూడా అందుబాటులో లేదు.

దీంతో కుటుంబం సభ్యులు అతడిని రక్షించుకోవడం కోసం ఎంతో తర్జనాభర్జనా పడి సుమారు 45 నిమిషాలకు ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు కెంపెగోద్వా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్టేషన్‌ని ఆశ్రయించి కేసు నమోదు చేశారు. ఐతే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సదరు కుటుంబం బెంగళూరు అర్బన్‌ జిల్లాలో ఉన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది.

అయితే విమానాశ్రయ అధికారులు వినియోగదారుల కోర్టు ఎదుట ఆరోపణలను తిరస్కరించగా, ఇండిగో మాత్రం పదేపదే నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించ లేదు. చివరికి బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ సదరు బాధిత ప్రయాణికుడని టెర్మినల్‌లోని క్లినిక్‌కి తీసుకెళ్లామని, ఈ తర్వాత బగ్గీలో ఆస్టర్‌ ఆస్పత్రికి తరలించినట్లు డాక్యుమెంట్‌లను కోర్టుకి సమర్పించింది. దీంతో వినయోగాదారుల కోర్టు కుటుంబ సభ్యుల ఆరోపణలను సమర్థిస్తూ..విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్‌ సదరు ప్రయాణికుడి సంరక్షణ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది.

ప్రయాణికులకు కావాల్సిన చోట సురక్షితమైన వాతావరణాన్ని అందిచాల్సిన బాధ్యత ఎయర్‌పోర్టు, ఎయిర్‌లైన్స్‌లదేనని పేర్కొంది. అందువల్ల బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా బెంగుళూరు ఎయిర్‌పోర్టు, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంయుక్తంగా దాదాపు రూ.12 లక్షలు చెల్లించాలిని, అలాగే కోర్టు ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని వినియోగాదారుల కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం వచ్చిన 45 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది. 

(చదవండి: త్వరలో కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం! 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top