పార్టీ కోసమే మా లేఖాస్త్రం 

Congress Senior Leaders Came Up With New Changes In Party - Sakshi

నాయకత్వాన్ని సవాలు చేసే ఉద్దేశం లేదు 

మాది అసమ్మతి కాదు 

కాంగ్రెస్‌ పునరుత్తేజం తక్షణావసరం 

కాంగ్రెస్‌ సీనియర్ల వివరణ

న్యూఢిల్లీ: నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లలో పలువురు మంగళవారం పలు వివరణలతో ముందుకు వచ్చారు. పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని తాము సవాలు చేయలేదని, అధ్యక్ష పదవిలో సోనియాగాంధీనే కొనసాగాలని కోరుకుంటున్నామని వివరణ ఇచ్చారు. లేఖను ఇప్పుడు తప్పుబడుతున్న వారు త్వరలో ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రాముఖ్యతను గుర్తిస్తారని మాజీ కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తపర్చడమే తాము రాసిన లేఖ ప్రధాన ఉద్దేశమన్నారు.

‘ఇది పదవికి సంబంధించిన విషయం కాదు.. దేశానికి సంబంధించిన విషయం. అదే మాకు ముఖ్యం’అని మరో సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ నర్మగర్భ ట్వీట్‌ చేశారు. పార్టీకి క్రియాశీల, పూర్తిస్థాయి నాయకత్వం అవసరమంటూ 23 మంది సీనియర్లు పార్టీ చీఫ్‌ సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో.. ఏఐసీసీ భేటీ జరిగేవరకు పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని సోమవారం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ‘మిత్రులారా.. మేం అసమ్మతివాదులం కాదు. పార్టీ పునరుత్తేజాన్ని కోరుతున్నవాళ్లం. ఆ లేఖ నాయకత్వాన్ని సవాలు చేస్తూ రాసింది కాదు.. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ రాసింది. చరిత్ర ధైర్యవంతులనే గుర్తుంచుకుంటుంది. పిరికివారిని కాదు’అని లేఖపై సంతకం చేసిన మరో నేత, ఎంపీ వివేక్‌ తాన్ఖా ట్వీట్‌ చేశారు. తాన్ఖా ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ మరో ట్వీట్‌ చేశారు. ‘పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ లేఖ రాశాం’అని అందులో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ భేటీ ఫలితంతో తాము సంతృప్తి చెందామని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు అన్నారు. సోనియా, రాహుల్‌ నాయకత్వంపై తమకెలాంటి అనుమానాలు లేవని, వారి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. 

సోనియా పార్టీకి అమ్మ వంటిది 
గాంధీ కుటుంబం త్యాగానికి పేరుగాంచిందని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. సోనియా నాయకత్వం పార్టీకి అవసరమని, అధ్యక్షురాలిగా కొనసాగేందుకు ఆమె అంగీకరించడం స్వాగతించదగిన అంశమన్నారు. తమ లేఖతో ఆమెకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యులమన్నారు. పార్టీకి సోనియా అమ్మలాంటి వారని,  శ్రేణులకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన తాను.. అన్ని సంక్షోభ సమయాల్లో పార్టీ నాయకత్వం వెంటనే నడిచానని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థీకృత పునరుత్తేజం కోసమే లేఖ రాశామని మొయిలీ స్పష్టం చేశారు.

పార్టీ అంతర్గత అవసరాల కోసం రాసిన లేఖ బహిర్గతం కావడం సరికాదని, అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. లేఖపై సంతకం చేసిన 23 మంది సీనియర్‌ నేతల్లో ఎవరికీ పార్టీని వీడి వెళ్లే ఆలోచన లేదన్నారు. బీజేపీ వల్ల దేశంలో ప్రజాస్వామ్య మౌలిక విలువలైన లౌకికత్వం, సమానత్వం, బహుళత్వం ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సోమవారం రాత్రి కపిల్‌ సిబల్, శశి థరూర్, ముకుల్‌ వాస్నిక్, మనీశ్‌ తివారీ తదితరులు ఆజాద్‌ ఇంట్లో సమావేశమవడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top