
ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
ఆ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలతో సామాన్య ముస్లింలు నష్టపోయారు
ముస్లింలపై అభిమానం ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ముస్లింకు ఇవ్వాలి
హిసార్: కాంగ్రెస్ పార్టిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విధ్వంసకారిగా కాంగ్రెస్ మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల సాధారణ ముస్లింలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు.
సోమవారం హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం హిసార్–అయోధ్య మధ్య తొలి కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్ జిల్లాలోని దీనబందు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్ మోడ్రన్ థర్మన్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విస్మరించిన కాంగ్రెస్
‘‘దేశంలో నేడు దురదృష్టం ఏమిటో చూడండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని రాజ్యాంగం చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయి. సమాజంలో సమానత్వం రావాలని అంబేడ్కర్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం ఆయుధంగా వాడుకుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌కు చేరింది కానీ గ్రామాలకు చేరుకోలేదు.
స్వాతంత్య్రం వచ్చి70 ఏళ్లు గడిచినా గ్రామాల్లో 16% ఇళ్లకు కూడా కుళాయి నీరు రాలేదు. కాంగ్రెస్ విధానాల వల్ల నష్టపోయింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. గత ఏడేళ్లలో 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. దేశంలో ప్రస్తుతం 80% ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. మిగతా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం తథ్యం. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నాం.
హవాయి చెప్పులు ధరించేవారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతోంది. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. గతంలో సరైన రైల్వేస్టేషన్లు లేనిచోట కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరింది. మన ఎయిర్‌లైన్ సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పరుగు ఆపని అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి.. ఇదే బీజేపీ ప్రభుత్వాల మంత్రం.
పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే మా ధ్యేయం. మా ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేడ్కర్‌కే అంకితం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పెద్దపెద్ద మాటలు చెబుతోంది. కానీ, అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్‌సింగ్‌కు కాంగ్రెస్ భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదన్న సంగతి మనం మర్చిపోవద్దు. అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న దక్కిందంటే అందుకు కారణం బీజేపీ. చౌదరి చరణ్‌సింగ్‌కు బీజేపీ ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది. అంబేడ్కర్ జయంతి చాలా ముఖ్యమైన రోజు. ఇది మనందరికీ రెండో దీపావళి.
మతం ఆధారంగా రిజర్వేషన్లా?
2013 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి హడావుడిగా సవరణలు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కుతంత్రాలకు పాల్పడింది. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? ఓటు బ్యాంకు కోసం ఆరాటపడింది ఎవరు? ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా అభిమానం ఉంటే ఆ పార్టీ అధినేతగా ముస్లింను నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 50 శాతం టికెట్లు ముస్లింలకే ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగం సైతం ఇలాంటి రిజర్వేషన్లపై నిషేధం విధించింది. కానీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ టెండర్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొడుతున్నారు.
లూటీని ఆపడానికే వక్ఫ్‌చట్టం
దేశంలో వక్ఫ్ బోర్డులకు లక్షల ఎకరాల భూములున్నాయి. అవి పేద ముస్లింలకు, మహిళలకు, చిన్నారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ భూములను సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే నేడు ముస్లిం యువత టైర్ల పంక్చర్ దుకాణాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. వక్ఫ్ భూములు కేవలం భూమాఫియాకే ఉపయోగపడుతున్నాయి. పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. దళితులు, వెనుకబడివర్గాలు, ఆదివాసీలు, వితంతువులను భూ మాఫియా లూటీ చేసింది. ఈ లూటీని ఆపడానికే వక్ఫ్(సవరణ) చట్టం తీసుకొచ్చాం. ఆదివాసీల భూములు, ఆస్తులను ఇకపై వక్ఫ్ బోర్డు తాకను కూడా తాకలేదు. వక్ఫ్ స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. ముస్లిం మహిళలు, పేదలు, చిన్నారుల హక్కులకు ఎప్ప టికీ రక్షణ లభించే ఏర్పాటు చేశాం. ఇదే అసలైన సామాజిక న్యాయం’’’ అని మోదీ ఉద్ఘాటించారు.