terminal buildings
-
రాజ్యాంగ విధ్వంసకారి కాంగ్రెస్: ప్రధాని మోదీ
హిసార్: కాంగ్రెస్ పార్టిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విధ్వంసకారిగా కాంగ్రెస్ మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల సాధారణ ముస్లింలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. సోమవారం హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం హిసార్–అయోధ్య మధ్య తొలి కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్ జిల్లాలోని దీనబందు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్ మోడ్రన్ థర్మన్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విస్మరించిన కాంగ్రెస్ ‘‘దేశంలో నేడు దురదృష్టం ఏమిటో చూడండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని రాజ్యాంగం చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయి. సమాజంలో సమానత్వం రావాలని అంబేడ్కర్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం ఆయుధంగా వాడుకుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌కు చేరింది కానీ గ్రామాలకు చేరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి70 ఏళ్లు గడిచినా గ్రామాల్లో 16% ఇళ్లకు కూడా కుళాయి నీరు రాలేదు. కాంగ్రెస్ విధానాల వల్ల నష్టపోయింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. గత ఏడేళ్లలో 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. దేశంలో ప్రస్తుతం 80% ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. మిగతా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం తథ్యం. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నాం. హవాయి చెప్పులు ధరించేవారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతోంది. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. గతంలో సరైన రైల్వేస్టేషన్లు లేనిచోట కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరింది. మన ఎయిర్‌లైన్ సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పరుగు ఆపని అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి.. ఇదే బీజేపీ ప్రభుత్వాల మంత్రం. పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే మా ధ్యేయం. మా ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేడ్కర్‌కే అంకితం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పెద్దపెద్ద మాటలు చెబుతోంది. కానీ, అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్‌సింగ్‌కు కాంగ్రెస్ భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదన్న సంగతి మనం మర్చిపోవద్దు. అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న దక్కిందంటే అందుకు కారణం బీజేపీ. చౌదరి చరణ్‌సింగ్‌కు బీజేపీ ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది. అంబేడ్కర్ జయంతి చాలా ముఖ్యమైన రోజు. ఇది మనందరికీ రెండో దీపావళి. మతం ఆధారంగా రిజర్వేషన్లా? 2013 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి హడావుడిగా సవరణలు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కుతంత్రాలకు పాల్పడింది. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? ఓటు బ్యాంకు కోసం ఆరాటపడింది ఎవరు? ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా అభిమానం ఉంటే ఆ పార్టీ అధినేతగా ముస్లింను నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 50 శాతం టికెట్లు ముస్లింలకే ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగం సైతం ఇలాంటి రిజర్వేషన్లపై నిషేధం విధించింది. కానీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ టెండర్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొడుతున్నారు. లూటీని ఆపడానికే వక్ఫ్చట్టం దేశంలో వక్ఫ్ బోర్డులకు లక్షల ఎకరాల భూములున్నాయి. అవి పేద ముస్లింలకు, మహిళలకు, చిన్నారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ భూములను సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే నేడు ముస్లిం యువత టైర్ల పంక్చర్ దుకాణాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. వక్ఫ్ భూములు కేవలం భూమాఫియాకే ఉపయోగపడుతున్నాయి. పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. దళితులు, వెనుకబడివర్గాలు, ఆదివాసీలు, వితంతువులను భూ మాఫియా లూటీ చేసింది. ఈ లూటీని ఆపడానికే వక్ఫ్(సవరణ) చట్టం తీసుకొచ్చాం. ఆదివాసీల భూములు, ఆస్తులను ఇకపై వక్ఫ్ బోర్డు తాకను కూడా తాకలేదు. వక్ఫ్ స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. ముస్లిం మహిళలు, పేదలు, చిన్నారుల హక్కులకు ఎప్ప టికీ రక్షణ లభించే ఏర్పాటు చేశాం. ఇదే అసలైన సామాజిక న్యాయం’’’ అని మోదీ ఉద్ఘాటించారు. -
గవ్వలు కావు.. లోహ విహంగాలు ఆగే చోటిది (ఫొటోలు)
-
ఎయిర్‌పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ విస్తరణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ.55 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. మరో పది రోజుల్లో పనుల శంకుస్థాపనకు శ్రీకారం జరపాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గోకే పరిమితం చేసి ప్రయాణాలన్నీ భోగాపురం వైపు సాగిస్తారన్న ప్రచారానికి తెరపడినట్లయింది. టెర్మినల్ విస్తరణ ఇలా... విశాఖ విమానాశ్రయంలో ఇప్పటికే వంద కోట్లతో అంతర్జాతీయ టెర్మినల్ భవంతి, 10,030 అడుగుల పొడవున రన్‌వే అభివృద్ధి జరిగింది. మూడు ఏరో బ్రిడ్జిలు, పార్కింగ్ బేస్‌లు విస్తరించింది. ఆరు పార్కింగ్‌బేలు ఇప్పటికే ఉండగా, మరో ఆరు పార్కింగ్ బేలు విమానాలు నిలుపుదలకు ఇటీవల సిద్ధం చేశారు. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో టెర్మినల్ బిల్డింగ్ ఎటూ చాలడం లేదు. లోపల రద్దీ పెరిగిపోయి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటోంది. ఈ తరుణంలో ఇక్కడి టెర్మినల్ బిల్డింగ్‌ను రెండు వైపులా 75 స్క్వేర్ మీటర్ల చొప్పున తూర్పు, పశ్చిమ దిశల్లో పదివేల స్క్వేర్ మీటర్ల విస్తరణ చేపట్టాలని పౌరవిమానయానశాఖ నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు ఖరారు చేసింది. ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే మార్కింగ్‌లు ఇచ్చేశారు. మరో పది రోజుల్లో పనులకు శ్రీకారం జరపాలని ఆశాఖ ఢిల్లీ నుంచి ఆదేశాలిచ్చింది. రన్‌వే మరో 300 అడుగులు విస్తరణ ఇదిలా ఉండగా ఇక్కడి రన్‌వేను మరో 300 అడుగులు విస్తరించడంతో పాటు మరో మూడు లగేజ్ బెల్టులు, మరో మూడు ఏరో బ్రిడ్జిలు ఏర్పాటుకు కూడా ప్రణాళికలు చేసింది. ఇప్పటికే దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, పోర్టుబ్లెయిర్, కొలంబో నుంచి అంతర్జాతీయ విమానాలు ఇక్కడ వాలుతుండగా, ఇంకా ఇక్కడ బోయింగ్ 747, ఎయిర్‌బస్ 340, ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ వంటి విమానాలు ఇక్కడ దించడానికి ఆయా విమాన సంస్ధలు ఉవ్విళ్లూగుతుండడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రేడ్ విమానాశ్రయాలంటే... సాధారణంగా చిన్నపాటి విమానాశ్రయాలను పౌరవిమానయానశాఖ బీ గ్రేడ్‌గా గుర్తిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ప్రయాణికుల రద్దీ 15 లక్షలు దాటితే ఏ గ్రేడ్ విమానాశ్రయంగా గుర్తింపునిస్తుంది. దీని వల్ల విమానాశ్రయం అభివృద్ధి అనూహ్యంగా పెరగడంతో పాటు ప్రపంచస్ధాయి అందాలు, సదుపాయాలూ చేకూరుతాయి. ఆ రకంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాదు తదితర విమానాశ్రయాలు గుర్తింపు పొందాయి. విశాఖ విమానాశ్రయంలో 2015–16లోనే 15లక్షలుదాటి ప్రయాణాలు సాగించిన తరుణంలో కేంద్రం ఆ స్థాయిని అప్పుడే ఇచ్చేసింది. గడచిన ఏడాదిలో 24,09,712 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఇక్కడి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించడం విశేషం. ఇలాంటి తరుణంలో విమానాశ్రయానికి డీజీఎం స్థాయి హోదా కాకుండా ఏ గ్రేడ్ హోదాకి తగ్గట్టు ఇక్కడ సీనియర్ జనరల్ మేనేజర్ హోదా ఉన్న ప్రకాష్‌రెడ్డిని కేంద్రం నియమించింది. -
యూరప్‌లో టెర్రరిస్టుల అరెస్టు పర్వం
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల అనంతరం యూరప్ అంతటా అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న అనుమానితులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో ఇసుమంత సంబంధమున్నా వారిని నిర్భందిస్తున్నారు. ఈ మంగళవారం బ్రస్సెల్స్‌లోని ఎయిర్ పోర్ట్ పై బాంబు దాడులకు పాల్పడి ఇద్దరు అమెరికన్లతో సహా 31మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించే ఇప్పటికే బ్రస్సెల్స్ లో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యుల వెనుక లగేజ్ నెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు నెయిబ్ అల్ హమీద్ అనే మరో వ్యక్తికి, రీదీ క్రికెట్ అనే వ్యక్తి కోసం వాంటెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం అంతటా అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
బ్రస్సెల్స్‌లో మరోసారి పేలుడు శబ్దాలు
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్‌లో మరోసారి భారీ బాంబు పేలుడు శబ్దం వినిపించింది. స్కార్ బీక్ జిల్లాలో పోలీసులు ఉగ్రవాదుల కోసం వేటాడుతుండగా తాజాగా బాంబు పేలుడు సంభవించిందని రాయిటర్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని కూడా పోలీసులు నిర్భంధించినట్లు సమాచారం. పోలీసుల తనిఖీల వల్ల గంభీరంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రస్సెల్స్ లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకొని దాదాపు 30మందికి పైగా చనిపోగా మరో 40మందికి పైగా గాయాలపాలయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారికోసం ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఒకరు మృతిచెందినట్లు కూడా తెలుస్తోంది. -
'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత'
బ్రెస్సెల్స్: బెల్జియం రాజధానిలో బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మంగళవారం బ్రస్సెల్స్‌లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుళ్ల ఘటన అనంతరం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దును మూసివేసి ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు వేటాడుతున్నాయి. -
బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులు
-
పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందు..
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి భారతీయుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటోంది. వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఒకరు గాయపడ్డారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్ చేశారు. జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన భారతీయ మహిళా ఉద్యోగి గాయపడ్డారని, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సుష్మ తెలిపారు. అయితే ఇద్దరు మహిళా సిబ్బంది గాయపడ్డారని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. మరోవైపు పేలుళ్ళ కారణంగా ముంబై నుంచి బ్రస్సెల్స్ వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. జెట్ ఎయిర్ వేస్ కూడా తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రస్సెల్స్ నుంచి ఢిల్లీ, ముంబై , టొరంటో తదితర నగరాలకు మార్చి 22 వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. తమ సిబ్బంది, ఇతర ప్రయాణికుల యోగక్షేమాలను విచారిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది. పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందే న్యూఢిల్లీ, ముంబై నుంచి జెట్ ఎయిర్ వేస్ కు చెందిన రెండు విమానాలు బ్రస్సెల్స్ చేరుకున్నాయి. బాంబు పేలుళ్ల ఘటనలో ఈ విమాన ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్ల నేపథ్యంలో దేశంలో అన్ని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్ లలో హై ఎలర్ట్ ప్రకటించారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఎక్కడ చూసినా రక్తమే.. యుద్ధాన్ని తలపించింది
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ దగ్గర సంభవించిన రెండు పేలుళ్లతో బీభత్స వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా రక్తమేనని పేలుడుకు 10 నిమిషాల ముందు జెనీవా నుంచి విమానంలో వచ్చిన జాచ్ మౌజోన్ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది చాలా పెద్ద పేలుడు. పరిస్థితి దారుణంగా ఉంది... పైకప్పులు కూలిపోయి భయానకమైన పరిస్థితి నెలకొంది. పైప్ లైన్ పగిలి.. బాధితుల రక్తంతో కలిసిపోయి ప్రవహించింది. గాయపడిన వారు, వారి బ్యాగులతో ఈ ప్రదేశమంతా రణరంగంలా మారి భీతిగొల్పింది. శిథిలాల మధ్య నడుచుకుంటూ వెళ్లా. ఇక్కడంతా యుద్ధ సన్నివేశంలా ఉంది' అంటూ జాచ్ మౌజోన్ స్థానిక మీడియాకు వివరించాడు. మరోవైపు చనిపోయిన వారిలో భారతీయులెవ్వరూ లేరని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. అక్కడి భారత రాయబారి మంజీవ్ సింగ్ పురితో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్ల ఘటనతో అక్కడి వాతావరణం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. -
బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులు
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధానిలోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల పేలుళ్లు, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. వందమందికి పైగా ఈ పేలుడు భారిన పడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. అయితే, పేలుళ్లకు గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, పేలుళ్లకు ముందు అరబిక్ భాషలో పెద్దగా అరుపులు వినిపించాయని, కాల్పులు కూడా సంభవించాయని కొంతమంది చెప్తున్నారు. టెర్మినల్స్ భవంతుల నుంచి మాత్రం పెద్ద మొత్తంలో పొగ వెలువడుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కొంత అనుమానానికి తావిస్తోంది. తమ వ్యక్తిని అరెస్టు చేశారన్న కోపంతో ప్రతికార దాడులు చేశారని అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.