ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్‌ | Father Daughter Duos From DMK And Congress Clash For Coimbatore South Seat Ahead Of Tamil Nadu Elections | Sakshi
Sakshi News home page

ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్‌

Mar 23 2026 12:27 PM | Updated on Mar 23 2026 12:58 PM

coimbatore south father daughter election race

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ  నియోజకవర్గం తాజాగా  హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. 

డీఎంకేలో స్టాలిన్‌ సమక్షంలో ఇంటర్వ్యూ: 
చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం  కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్‌.ఎస్‌.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్‌ కార్తీక్‌ సెల్వరాజ్‌ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్‌ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు  వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో  స్టాలిన్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీలోనూ అదే సీన్‌ 
డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్‌) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్‌ టాపిక్‌ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్‌ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. 

కమల్‌ ఖాతాలో పడేనా.. 
గత ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం  గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్‌ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్‌ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్‌ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్‌ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్‌ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement