చెన్నై: తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టైయన్‌ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర‍్తన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎవరెవరికి ఏయే శాఖలు?
శాఖల కేటాయింపు జాబితా ప్రకారం.. విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి.
- కేఏ సెంగొట్టైయన్ కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు.
- అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలూ ఆమెకే అప్పగించారు. కీలక శాఖను మహిళా మంత్రికి ఇవ్వడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
- ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి.
- ఆధవ్ అర్జున ప్రజా పనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పనుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను ఆయన పర్యవేక్షిస్తారు.
- డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.
- పీ వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలూ ఆయనకే అప్పగించారు.
- ఆర్ నిర్మల్‌కుమార్ కు ఇంధన వనరులు, న్యాయ శాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి.
- రాజ్‌మోహన్ పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడతారు. పురావస్తు శాఖ, అధికారిక తమిళ భాష, తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ, ప్రభుత్వ ముద్రణ శాఖలూ ఆయన పరిధిలో ఉంటాయి.
- డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు.


