ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్‌లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్‌మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్‌తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్‌ను ముగించాలంటూ విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది.
Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏
Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026
అలా మొదలైంది..
ఎయిర్‌కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్‌గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా.

మార్పు మొదలైంది..
అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్‌గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్‌కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL
— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026
లిసిప్రియ ఎవరంటే..
లిసిప్రియా కాంగుజమ్.. భారత్‌కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్‌లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్‌నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కు చేసిన రిక్వెస్ట్‌తో ఆమె వార్తల్లో నిలిచింది.


