తమిళనాడు: అన్నామలైకు జెడ్ కేటగిరి భద్రత

సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు జెడ్‌కేటగిరి భద్రతకు కేంద్రం ఆదేశించింది. ఆయనకు ఇద్దరు ప్రత్యేక భద్రతాధికారులతో పాటు పది మంది సీఆర్‌పీఎఫ్ బృందంతో ప్రత్యేక భద్రతకు చర్యలు చేపట్టారు. ఈయన కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ 2019లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు.
అయితే పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని రజనీకాంత్ విరమించుకోవడంతో వ్యవసాయం చేసుకుంటానని అన్నామలై ప్రకటించారు. చివరకు బీజేపీలో చేరారు. తొలుత కరూర్ జిల్లా రాజకీయాలకు పరిమితమయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయన్ను వరించింది. అప్పటి నుంచి దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. సొంత పారీ్టలోనూ అన్నామలైకు వ్యతిరేకత ఉన్నా, వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా బలోపేతం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. సీనియర్లందరిని పక్కన పెట్టి, యువతరానికి పెద్ద పీట వేస్తున్నారు. అధికార డీఎంకే, వారి మిత్రపక్షాలతో వైర్యం పెంచుకోవడమే కాకుండా నిత్యం మాటల తూటాలను పేల్చుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవల పరిణామాలతో భద్రత పెంపు
ఇటీవల బీజేపీతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అన్నామలైకు భద్రత కల్పించాల్సిన అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించే విధంగా కేంద్రం శుక్రవారం ఆదేశించింది. ఆయనకు భద్రతగా ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించేందుకు నిర్ణయించింది. అలాగే, పది మంది సీఆర్‌పీఎఫ్ బృందం నిత్యం భద్రతా విధుల్లో ఉండబోతోంది. ఇకపై తుపాకీ నీడలో అన్నామలై పర్యటనలు జరగనున్నాయి. ఆయన భద్రతను కేంద్రం పర్యవేక్షించనుంది.