Nipah Virus: Kerala 12 ఏళ్ల బాలుడు మృతి

Central Team Rushed To Kerala As 12 Years Old Boy Dies Of Nipah Virus - Sakshi

కేరళలో మరోమారు వెలుగు చూసిన నిఫా వైరస్‌

ఎన్‌సీడీసీ బృందాన్ని పంపిన కేంద్రం

తిరువనంతపురం: కోవిడ్‌తో విలవిల్లాడుతున్న కేరళను మరో మహమ్మారి భయపెడుతుంది. కేరళలో మరోసారి నిఫా వైరస్‌ వెలుగు చూసింది. తాజాగా కేరళలో నిఫా వైరస్‌ బారిన పడి ఓ బాలుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. 12 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో ఈనెల 3న కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అందులో నిఫా వైరస్‌ ఉన్నట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. 

ఈ క్రమంలో నిఫా వైరస్‌ కారణంగానే బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. వారందరిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పని ప్రారంభించామని తెలిపారు. (చదవండి: Covid-19: పదిరోజులు జాగ్రత్త.. లేదంటే..)

కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిఫా వైరస్‌ వల్లే బాలుడు మరణించాడని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కోజికోడ్‌ పంపించింది. కాగా, దేశంలో మొదటిసారిగా నిఫా కేసు కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో 2018లో నమోదైంది. వైరస్‌ వల్ల నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోగా, మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.

చదవండి: కోవిడ్‌ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top