‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి

Central Govt Announced Padma Awards 2023  - Sakshi

ఆరుగురికి రెండో అత్యున్నత పురస్కారం 

9 మందికి పద్మభూషణ్‌

91 మందికి పద్మశ్రీ

సాక్షి, న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ దక్కింది. 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు.

ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్‌ యాదవ్‌తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్‌ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ పద్మ విభూషణ్‌ గ్రహీతల్లో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్‌ డి.పటేల్‌కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్‌ దక్కడం విశేషం. మిల్లెట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా దూదేకుల ఖాదర్‌ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది.

పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. ప్మద అవార్డుల గ్రహీతలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు.

పద్మ విభూషణ్‌  
ములాయంసింగ్‌ యాదవ్‌ (మరణానంతరం), జాకీర్‌ హుస్సేన్, ఎస్‌ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్‌ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహాలనబిస్‌ (మరణానంతరం), ఇండో–అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వర్ధన్‌

పద్మభూషణ్‌
చినజీయర్‌ స్వామి (ఆధ్యాత్మిక రంగం), కుమారమంగళం బిర్లా (వాణిజ్యం, పరిశ్రమలు), వాణీ జయరాం (కళ), సుధామూర్తి (సామాజిక సేవ), కమలేష్‌ డి.పటేల్‌ (ఆధ్యాత్మిక రంగం), ఎస్‌ఎల్‌ భైరప్ప (కళ), దీపక్‌ధర్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), సుమన్‌ కల్యాణ్‌పుర్‌ (కళ), కపిల్‌ కపూర్‌ (సాహిత్యం–విద్య)
 
పద్మశ్రీ  

ఏపీ నుంచి:
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ), గణేశ్‌ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం–విద్య).
తెలంగాణ నుంచి: మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య).
పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఖాదర్‌ వలీతో పాటు స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్‌ తదితరులున్నారు.

 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top