భారత్‌లో కొత్త రకం కరోనా!

CCMB Research: New Genetic Changes Find In Corona Virus - Sakshi

రెండుసార్లు జన్యుమార్పిడి జరిగిన వైరస్‌ వ్యాప్తి

పదివేల నమూనాలను విశ్లేషించిన ఇన్సాకాగ్‌

ఆందోళనకరంగా 771 రకాల కరోనా

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ

కళ్లు గప్పగల జన్యుమార్పుల గుర్తింపు

కేసుల పెరుగుదలకు, వీటికి సంబంధంపై పరిశోధన

న్యూఢిల్లీ: రెండుసార్లు జన్యు మార్పిడి జరిగిన కరోనా వైరస్‌ను మన దేశంలో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దానితోపాటు పలు ఆందోళనకర వైరస్‌ రకాలు కూడా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. జన్యుక్రమంలో ఓసారి మార్పులు జరిగిన వైరస్‌లో మరోసారి కూడా జన్యుమార్పిడి జరిగి సరికొత్త రకమైన వైరస్‌గా మారడం భారత్‌లోనే కనిపించిందని, ఇతర రకాలు కొన్ని గతంలోనే విదేశాల్లో బయటపడ్డాయని వివ రించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటానికి ఈ కొత్త వైరస్‌ రకాలే కారణమా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. వైరస్‌ జన్యు క్రమంతోపాటు వ్యాధికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని వివరించింది.

ఇన్సాకాగ్‌ నేతృత్వంలో..
కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో ‘ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 కన్సార్షియం ఆన్‌ జినోమిక్స్‌ (ఇన్సాకాగ్‌)’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)తోపాటు దేశంలోని పది జాతీయ పరిశోధనశాలల్లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి వైరస్‌ జన్యుక్రమాలను నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి సంబంధీకుల నుంచి శాంపిల్స్‌ సేకరించి, ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. జన్యుక్రమాలను గుర్తించడం ద్వారా వైరస్‌కు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చని.. వ్యాధి చికిత్స, టీకాల తయారీలో ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

తెలంగాణలో కొత్త రకాల వ్యాప్తి..
కేరళలోని 14 జిల్లాల నుంచి వచ్చిన 2,032 నమూనాలను విశ్లేషించగా.. రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకోగల ఎన్‌440కే రకం వైరస్‌ 123 నమూనాల్లో కనిపించిందని ఇన్సాకాగ్‌ వివరించింది. గతంలో ఈ వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌ నమూనాల్లో 33 శాతం వరకూ ఉండేదని తెలిపింది. తెలంగాణ నుంచి సేకరించిన 104 నమూనాల్లోని.. 53 నమూనాల్లో కొత్త రకాన్ని గుర్తించామని తెలిపింది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి పదహారు దేశాల్లో ఈ ఎన్‌440కే రకం వైరస్‌ వ్యాపించిందని పేర్కొంది.

771 రకాల గుర్తింపు
ఇప్పటివరకు 771 రకాల కరోనా వైరస్‌లను గుర్తించామని, అవన్నీ ఆందోళన కలిగించేవేనని ఇన్సాకాగ్‌ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం 10,787 నమూనాల్లో యూకే రకం వైరస్‌ను 736 నమూనాల్లో, దక్షిణాఫ్రికా రకం వైరస్‌ను 34 నమూనాల్లో, బ్రెజిల్‌ రకం వైరస్‌ను ఒక నమూనాలో గుర్తించామని తెలిపింది. మహారాష్ట్ర నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించినప్పుడు గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం.. ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ జన్యుమార్పులున్న వైరస్‌లు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఈ రెండు జన్యుమార్పులు రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకునేందుకు వైరస్‌కు అవకాశం కల్పిస్తాయని వివరించింది. ఈ జన్యుమార్పులు 15- 20 శాతం నమూనాల్లో ఉన్నట్టు గుర్తించామని.. ఇప్పటిదాకా గుర్తించిన వైరస్‌లతో వీటికి పోలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. కొత్త రకం వైరస్‌ను కట్టడి చేసేందుకు.. విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ వారికి దగ్గరగా వ్యవహరించిన వారిని గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, తగిన చికిత్స కల్పించడం అత్యవసరమని స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top