
ఉగ్ర శిబిరాలపై ప్రయోగం
జాతీయ మీడియా కథనాలు
బికనీర్ సమీపంలో క్షిపణి బూస్టర్, నోస్
జైపూర్/ లఖ్‌నవూ/ న్యూఢిల్లీ: సరిహద్దులపై ఎడాపెడా దాడులకు తెగబడ్డ పాక్ బ్రహ్మాస్త్రం దెబ్బకు దిగొచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను పాక్ మీదికి భారత్ ప్రయోగించినట్టు వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ బూస్టర్, నోస్‌క్యాప్ లభించడం దీన్ని ధ్రువీకరిస్తోంది. ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మూలాలను పెకలిస్తూ పాక్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న దాని ప్రధాన స్థావరంపై మే 7 అర్ధరాత్రి దాటాక భారత క్షిపణులు విరుచుకుపడటం తెలిసిందే.
బ్రహ్మోస్ బూస్టర్, నోస్ క్యాప్ దొరికింది బహావల్‌పూర్ ఉన్న దిశలోనే. బ్రహ్మోస్‌ను ప్రయోగించాక దాన్నుంచి విడివడే అనుబంధ భాగాల శకలాలతో అవి దాదాపుగా పోలుతున్నాయి. కనుక ఆ గగనతలం గుండానే బ్రహ్మోస్ దూసుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. బహావల్‌పూర్‌లోని జైషే భవనాలను కూల్చేందుకు శక్తిమతమైన క్షిపణులను ప్రయోగించినట్లు భారత్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. వాటిలో బ్రహ్మోస్ కూడా ఉందన్న వార్తలకు ఇది కూడా బలం చేకూరుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యుద్ధంలో బ్రహ్మోస్‌ను వాడటం ఇదే తొలిసారి. అయితే దాని వినియోగాన్ని కేంద్రం ధుృవీకరించడం లేదు.
బ్రహ్మోస్ దెబ్బ పాక్‌కు తెలుసు: యోగి
‘‘బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంకా ఎవరికైనా తెలియాలంటే తాజాగా ఆ దెబ్బను రుచిచూసిన పాక్‌ను అడిగి తెలుసుకోవచ్చు’’ అని యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖ్‌నవూలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ కేంద్రం ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతంచేయనంత వరకు ఆ సమస్యకు పరిష్కారం లభించదు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణచివేయాల్సిన తరుణమొచ్చింది. ఉగ్రవాదం కుక్కతోక వంటిది. దాన్నెప్పటికీ సరిచేయలేం. ఉగ్రవాదులకు వాళ్ల బాషలోనే బుద్ధిచెప్పాలి’’ అన్నారు.
సైనిక సందేశం బ్రహ్మోస్: రాజ్‌నాథ్
భారత సాయుధ బలగాల సామర్థ్యానికి బ్రహ్మోస్ నిలువెత్తు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఆదివారం లఖ్‌నవూలో నూతన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ కేంద్రాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘నేషనల్ టెక్నాలజీ డే (ఆదివారం) రోజే బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది శక్తిమంతమైన ఆయుధం మాత్రమే కాదు, మన సాయుధ బలగాల అమేయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ఒక సందేశం. శత్రువులకు సింహస్వప్నం. సరిహద్దుల పరిరక్షణలో మన అంకితభావాన్ని ఈ క్షిపణి చాటిచెబుతుంది’’ అన్నారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ తయారీ కేంద్రంలో మ్యాక్ 2.8 వేగంతో 290 నుంచి 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణుల తయారు చేయనున్నారు.