బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు

Birthday Cake Saves Brothers Life Escape From Leapord Madhya Pradesh - Sakshi

భోపాల్‌: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిరోజ్‌, సబీర్‌ మన్సూరీ ఇద్దరు అన్నదమ్ములు. కాగా గురువారం ఫిరోజ్‌ తన కుమారుడు పుట్టినరోజు కావడంతో కేక్‌ కొనుగోలు చేసేందుకు అతని సోదరుడు సబీర్‌ మన్సూరితో కలిసి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు.

కేక్‌ కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న చెరుకుతోట వద్ద ఒక చిరుతపులి వీరి బైక్‌ను వెంబడించింది. భయంతో వారిద్దరు తమ బైక్‌ను వేగంగా పోనిచ్చినప్పటికి చిరుత పులి వేగంగా వారిని సమీపించింది. బైక్‌పై వెనుకాల కూర్చున్న సబీర్‌ ఏం చేయాలో తెలియక తన చేతొలో ఉన్న కేక్‌బాక్స్‌ను చిరుత మీదకు విసిరాడు. అయితే అది ఏదైనా మారణాయుధం అని భావించిన చిరుత పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటివరకు ప్రాణభయంతో పరుగులు పెట్టిన వారిద్దరు బతుకుజీవుడా అంటూ గ్రామానికి చేరుకున్నారు.

ఊర్లోకి వెళ్లిన తర్వాత గ్రామస్థులకు విషయం చెప్పడంతో స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫిరోజ్‌ అందించిన సమాచారం మేరకు చిరుత పులి వారి బైక్‌ను దాదాపు 500 మీటర్ల దూరం వెంబడించిందని అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం తమ చేతిలో ఉన్న కేక్‌బాక్స్‌ను విసిరేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top