4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ | Sakshi
Sakshi News home page

4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ

Published Thu, Jan 7 2021 4:58 AM

Bird flu outbreak reported in 4 states - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(అవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా) వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ వెల్లడించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్తాన్‌లోని బరాన్, కోట, ఝలావర్, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్, ఇండోర్, మాల్వా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా(వలస పక్షుల కేంద్రం), కేరళలోని కొట్టాయం, అలప్పుజాలో నాలుగు చోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కనుగొన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై తాజా పరిస్థితి అంచనా వేయడానికి ఢిల్లీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల్లో అధికారులు చేపట్టిన బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యలపై రోజువారీ గణాంకాలు సేకరించేందుకు ఈ కంట్రోల్‌ రూమ్‌ నెలకొల్పినట్లు పేర్కొంది. దేశంలో మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలియజేసింది.

కర్ణాటకలో హై అలర్ట్‌  
జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైఅలర్ట్‌  ప్రకటించినట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చెప్పారు. కేరళ నుంచి పౌల్ట్రీ కోళ్లు, కోడి మాంసం రవాణా చేయకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కేరళతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి కోడిమాంసం దిగుమతిపై 10 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బుధవారం చెప్పారు.

ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందాలు
బర్డ్‌ఫ్లూ ప్రభావం అధికంగా ఉన్న కేరళలోని అలప్పుజా, కొట్టాయం, హరియాణాలోని పంచకుల జిల్లాలకు  బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ బృందాల్లో ఎన్‌సీడీసీ, ఎన్‌ఐజీ, ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్, లేడీ హర్డింగ్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన నిపుణులు ఉంటారు. అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో బాతుల్లో, పంచకుల జిల్లాలో పౌల్ట్రీ కోళ్లలో బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు వెల్లడించింది.  బృందాలు ఆయా జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలకు సహరిస్తాయని తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement