10 రాష్ట్రాలకు బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి

Bird flu outbreak confirmed in 10 states - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బర్డ్‌ ఫ్లూ ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కాగా, సోమవారం ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోనూ ఈ వ్యాధిని గుర్తించారు. రాజస్తాన్‌లోని టోంక్, కరౌలి, భిల్వారా, గుజరాత్‌లోని వల్సాద్, వడోదర, సూరత్‌ జిల్లాల్లో కాకులు, వలస పక్షలు, అడవి పక్షులు బర్డ్‌ ఫ్లూతో మరణించినట్లు కేంద్రం నిర్ధారించింది. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్, డెహ్రాడూన్‌ జిల్లాల్లో కూడా కాకులు మరణించినట్లు తెలిపింది. తూర్పు ఢిల్లీలోని సంజయ్‌ లేక్‌ ప్రాంతంలో కాకులు, బాతుల మరణానికి బర్డ్‌ఫ్లూ కారణమని తేల్చింది.

మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. అలాగే ముంబై, థానే, దపోలి, బీడ్‌ ప్రాంతాల్లోనూ బర్డ్‌ ఫ్లూ కేసులు వెలుగు చూసినట్లు కేంద్రం వెల్లడించింది. బర్డ్‌ ఫ్లూపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని నిరోధించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. నీటి వనరులు, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ట్రీ ఫామ్‌ల చుట్టూ నిఘా పెంచాలని, మరణించిన పక్షులను పారవేయడంలో సరైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. దేశంలో బర్డ్‌ఫ్లూ కేసులు ఉన్నప్పటికీ పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని, మార్కెట్లను మూసివేయొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సోమవారం అన్ని రాష్ట్రాలకు సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి పక్షులు, పశువుల నుంచి మనుషులకు సోకుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుచేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top