
బెంగళూరు: ఈ ఏడాది ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించవచ్చనే వార్తలు ఎప్పటి నుంచో వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం కన్నడ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముష్తాక్ చేతుల మీదుగా ఈ ఉత్సవాలను ప్రారంభింపజేసింది. దీనివెనుక పలు కారణాలున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
మైసూరు దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలను ప్రముఖ కన్నడ రచయిత్రి, బుకర్ బహుమతి గ్రహీత బాను ముష్తాక్ (Banu Mushtaq) సెప్టెంబర్ 22న మైసూరులోని చాముండి కొండపై ప్రారంభించారు. ‘హృదయ దీప’ పుస్తకానికి బుకర్ ప్రైజ్‌ను అందుకుని, అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన బాను ముష్తాక్,ఈ పురస్కారం అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా నిలిచారు. హసన్ జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె కన్నడ సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. జర్నలిస్ట్‌గా పనిచేసిన బాను ముష్తాక్ కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, చింతామణి అత్తిమబ్బే కూడా అవార్డును గెలుచుకున్నారు.
ఆమె సాగించిన సాహిత్య రచనలు పలువురి ప్రశంసలు పొందాయి. బాను ముష్తాక్‌ను దసరా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎన్నిక చేయడం ద్వారా కర్ణాటక (Karnataka) సాంస్కృతిక వారసత్వానికి మరింత ఖ్యాతి దక్కుతుందని రాష్ట్రప్రభుత్వం భావించింది. ప్రాంతీయ బాషా వివాదాలు చెలరేగుతున్ను ప్రస్తుత తరుణంలో కన్నడ భాషకు పట్టంకట్టే ఉద్దేశంతోనే కర్ణాటక ప్రభుత్వం రచయిత్రి బాను ముష్తాన్‌ను దసరా ఉత్సవాలకు ప్రధాన అతిథిగా ఎంచుకుంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) కన్నా బాను ముష్తాక్ ఎంచుకోవడం ద్వారా ప్రాంతీయాభిమానాన్ని కూడగట్టుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం భావించి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 11 రోజుల పాటు జరిగే మైసూరు దసరా వేడుకల్లో భారీ ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద ప్రదర్శనలు నిర్వహిస్తారు.