బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పరిశుభ్రత పక్కదారి పడుతుండటంతో గ్రేటర్ బెంగళూరు అథారిటీ తాజాగా ‘గార్బేజ్ డంపింగ్ ఫెస్టివల్’ను ప్రారంభించింది. రోడ్ల మీద చెత్త పడేసి, చేతులు దులుపుకుని వెళ్లే నగర పౌరుల తీరుకు చెక్ పెట్టేందుకు నడుంబిగించింది. బెంగళూరు మున్సిపల్ అథారిటీ.. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే.. ముందు మనం మారాలి అనే నినాదంతో చెత్త డంపింగ్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టింది.
ఎవరైనా రోడ్ల మీద చెత్త పారవేస్తే, అదే చెత్తను వారికి రిటర్న్ గిఫ్ట్‌గా పంపిస్తామని హెచ్చరిక చేసింది. సీసీ కెమెరాల ద్వారా చెత్త పడేసే వారిని గుర్తించి, వారి చెత్తను వారి ఇంటి ముందే డంప్ చేస్తామని తెలిపింది. అలాగే వారికి రెండు వేల రూపాయలు జరిమానా కూడా విధిస్తామని పేర్కొంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ), బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) సంయుక్తంగా ఈ ‘చెత్త డంపింగ్ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ముందుగా జీబీఏ ప్రత్యేక సిబ్బంది వీధులు, ఫుట్‌పాత్‌లు, ఖాళీ స్థలాలలో చెత్తను వేసే వ్యక్తులను గుర్తిస్తారు. తరువాత వారు ఆ చెత్తను వారి ఇళ్ల వెలుపల పోస్తారు. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడేవారికి రూ.రెండు వేలు జరిమానా విధిస్తారు. ఈ విధంగా జీబీఏ ప్రత్యేక సిబ్బంది చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం తొలి రోజున 218 ఇళ్ల ముందు చెత్తను వేసి, వారి నుంచి రూ. 2.8 లక్షల జరిమానాలు వసూలు చేశారు. ఈ ప్రచారం తొలుత నగరంలోని బనశంకరిలో ప్రారంభమైంది. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.
బహిరంగ వ్యర్థాల తొలగింపు, ప్రజా జవాబుదారీతనం పెంపొందించేందుకు బెంగళూరు మున్సిపల్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బెంగళూరును పరిశుభ్రంగా ఉంచడంలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. దీనిని కొందరు బెంగళూరువాసులు మెచ్చుకుంటుండగా, మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అధికారులు బెంగళూరు అంతటా ఈ ప్రచారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Egypt: ‘నాలుగో పిరమిడ్’ లేచింది.. ‘వారెవ్వా’ అనాల్సిందే!


