
భారత స్వాతంత్య్ర చట్టం–1947 ఆమోదం పొందిన రోజు ఇది. బ్రిటిష్ ఇండియాను భారత్, పాక్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్ చేసిన ఈ చట్టం 1947 జూలై 18న బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ ప్రకారం భారత్, పాక్‌లకు ఆగస్టు 15 వ తేదీ స్వాతంత్య్రం వచ్చినట్లు. అయితే వైశ్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15 వ తేదీన అధికార బదలీ కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో పాకిస్థాన్ ఒక రోజు ముందే ఆగస్టు 14న తన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది.
భారత స్వాతంత్య్ర చట్టాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, సిక్కుల తరఫున బల్‌దేÐŒ సింగ్, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ కలిసి కూర్చొని, చర్చించి రూపొందించారు. కాంగ్రెస్ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, ఆచార్య కృపలానీ, ముస్లిం లీగ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ఆ సమావేశానికి ప్రాతినిథ్యం వహించారు. విభజనను గాంధీజీ వ్యతిరేకిస్తుండటంతో సమావేశానికి రమ్మని ఆయనకు ఆహ్వానం అందలేదు.