On This Day July 27th: ఆరు చొక్కాలు.. నాలుగు ప్యాంట్లు.. ఒక జత షూ

Azadi Ka Amrit Mahotsav Avul Pakir Jainulabdeen Abdul Kalam Story - Sakshi

దేశ ప్రథమ పౌరుడి హోదాలో కూడా అతి సామాన్య జీవితాన్ని గడిపి ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచిన మహానుభావుడు అబ్దుల్‌ కలామ్‌. రాష్ట్రపతిగా (2002–2007) కలామ్‌కి ఎంత గొప్ప వ్యక్తి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చినా, ఎంత చిన్న వ్యక్తి దగ్గర్నుంచి అభినందన వచ్చినా.. స్వయంగా తానే వారికి జవాబు రాసి పంపేవారట. అభినందనలకు కృతజ్ఞతలూ తెలిపేవారట. వినయం, విజ్ఞత, ఔదార్యం ఆయనకు పుట్టుకతోనే అబ్బిన గుణాలు. కలామ్‌ రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే అంతకుముందు తను చేసిన ఉద్యోగం తాలూకు సేవింగ్స్‌ అన్నింటినీ ‘పురా’ (ప్రొవైడింగ్‌ అర్బన్‌ ఎమినిటీస్‌ టు రూరల్‌ ఏరియాస్‌) అనే ట్రస్టును స్థాపించి దానికి రాసిచ్చేశారు.

పట్టణ సౌకర్యాలను గ్రామాల్లోనూ అందుబాటులోకి తేవడం పురా పని. కలామ్‌ సంపాదించిన ప్రతి పైసా ఆ ట్రస్ట్‌కే వెళ్లింది. చనిపోయే నాటికి కలామ్‌ దగ్గరున్న ఆస్తి.. 25 వందల పుస్తకాలు, ఒక చేతి గడియారం, ఆరు చొక్కాలు, నాలుగు పాంట్లు, ఒక జత షూ మాత్రమే! సామాన్యుడికి కూడా ఇంతకన్నా ఎక్కువ ఆస్తే ఉంటుంది కదా. కలామ్‌ ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అందులో ‘తిరుక్కురల్‌’ అనే పుస్తకంలోని సూక్తులను తప్పకుండా ప్రస్తావించేవారు. నేడు ఆయన వర్ధంతి. 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ కలామ్‌ హటాత్తుగా ప్రసంగం మధ్యలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. 

ఆరా హౌస్‌ ముట్టడి
1857 సిపాయిల తిరుగుబాటు ప్రస్తావన రాగానే మొదట ఢిల్లీ, లక్నో, కాన్పూర్‌ పేర్లు స్ఫురిస్తాయి. బిహార్‌ పేరు తక్కువగా వినిపిస్తుంది. బ్రిటిషర్‌ల అధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు దేశంలో పలు ప్రాంతాల్లోని భారతీయ సిపాయిలు, స్థానిక జమీందారులు తిరుగుబాట్లు చేశారు. ఆ వరుసలో అదే ఏడాది బిహార్‌ ప్రాంతంలో జూలై 27 జరిగిన ‘ఆరా హౌస్‌ ముట్టడి’ కూడా చరిత్రాత్మకమైనదే.

దుర్భేద్యమైన ఆ భవంతిలో ఉన్న ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్‌ అధికారులను తరిమికొట్టేందుకు కున్వర్‌సింగ్, బాబు అమర్‌సింగ్, హరేకృష్ణసింగ్, రంజిత్‌సింగ్‌ అహిర్‌ అనే తిరుగుబాటు నాయకుల నేతృత్వంలో ముట్టడి జరిగింది. ఆగస్టు 3 వరకు జరిగిన ఆ 8 రోజుల పోరాటంలో చివరికి బ్రిటిష్‌ వారే గెలిచినప్పటికీ భారతీయులు వీరోచితంగా పోరాడి చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా కున్వర్‌ సింగ్‌! బిహార్, భోజ్‌పూర్‌జిల్లా జగ్దీశ్‌పూర్‌లోని రాజకుటుంబానికి చెందిన కున్వర్‌ సింగ్‌ తన 80 ఏళ్ల వయసులో ఈ ఆరాహౌస్‌ ముట్టడిని నడిపించారు!  

(చదవండి: మేరీ కోమ్‌ విల్‌పవర్‌ పంచ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top