భూమిపూజకు అయోధ్య సిద్దం

ayodhya ram temple inauguration by pm modi - Sakshi

సర్వాంగ సుందరంగా ముస్తాబైన పట్టణం 

హాజరుకానున్న ప్రధాని, ప్రముఖులు

అయోధ్య: రామ మందిర నిర్మాణానికి సంబంధించి బుధవారం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య పట్టణం సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. బారికేడ్లు, బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలువురు స్థానికులు తమ ఇళ్లకు, దుకాణాలకు కొత్త రంగులు వేసుకున్నారు. పలు చోట్ల భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి 175 మందిని మాత్రమే ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పట్టణానికి చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఎవరూ రావద్దని స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ అయోధ్యకు రావద్దని కోరారు. మొత్తం శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు.

అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయ ప్రాంతం మంగళవారం పోలీసు సైరన్లతో, ఆలయం నుంచి వినిపించే భజనలతో హోరెత్తిపోయింది. ఆ ఆలయాన్ని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. పోలీసులు అయోధ్యకు వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల మొబైల్‌ నంబర్‌ సహా ప్రతీ వివరం తెలుసుకుంటున్నారు. కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సీనియర్‌ ఎస్పీ దీపక్‌ కుమార్‌ తెలిపారు. ఆహ్వానం లేకుండా బయటివ్యక్తులెవరూ అయోధ్యలో అడుగుపెట్టకుండా చూసుకుంటున్నామన్నారు. అలాగే, పట్టణంలో నలుగురికి మించి గుమికూడకుండా ఆంక్షలు విధించామని తెలిపారు. బయటివారెవరూ పట్టణంలో లేరని నిర్ధారించుకునేందుకు.. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని వివరించారు. భూమి పూజ మినహా పట్టణంలో మరే ఇతర మతపరమైన కార్యక్రమం నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే, ఆలయాలు, మసీదులు, ప్రార్థనామందిరాలు తెరిచే ఉంటాయి.

భూమి పూజలో ప్రధాని
అయోధ్యలో బుధవారం ‘శ్రీ రామ జన్మభూమి మందిర్‌’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఆ కార్యక్రమం కన్నాముందు హనుమాన్‌ గఢీ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారని తెలిపింది. ‘అక్కడి నుంచి శ్రీ రామ జన్మభూమికి వెళ్లి అక్కడ భగవాన్‌ శ్రీ రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ను దర్శించుకుని, పూజలు నిర్వహిస్తారు’ అని వెల్లడించింది. ఆ ప్రాంగణంలో ఒక పారిజాత మొక్కను కూడా నాటుతారని పీఎంఓ తెలిపింది. ఆ తరువాత భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. భూమి పూజ సందర్భంగా శిలాఫలకాన్ని, స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారని తెలిపింది.   

హనుమాన్‌ గఢీలో ప్రథమ పూజ ఆనవాయితీ
ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌ గఢీ ఆలయంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామ మందిరం భూమిపూజకు ముందుగా ప్రధాని హనుమాన్‌ ఆలయంలో పూజలు చేయనున్నారు. శ్రీరాముడి  దర్శనానికి ముందుగా ఎవరైనా రామభక్త ఆంజనేయుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా వైరస్‌ ప్రొటోకాల్‌ కారణంగా తాము ప్రధానితో మాట్లాడేందుకు కూడా అవకాశం లేదని ఆలయ పూజారి మహంత్‌ రాజు దాస్‌ తెలిపారు.  72 మెట్లుండే హనుమాన్‌ గఢీ ఆలయం ఉత్తర భారతంలో అత్యంత ప్రముఖమైందిగా పేరు. ఈ ఆలయంలో బాల ఆంజనేయుడు తన తల్లి అంజనీ దేవి ఒడిలో కూర్చుని ఉంటాడు. రావణుడిపై విజయం సాధించిన అనంతరం శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని ఆంజనేయుడు నివసించేందుకు ఇచ్చాడు. అందుకే దీనిని హనుమాన్‌ గఢీ లేదా హనుమాన్‌ కోట్‌ అంటారు.  

12:30 గంటలకు భూమిపూజ ప్రారంభం
12:40 గంటలకు పునాది రాయి పూజ
175 మందికే ఆహ్వానం

అయోధ్యలో ప్రధాని 3 గంటలు
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమిపూజలో పాల్గొనే ప్రధాని మోదీ పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. బుధవారం ఆయన అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు గడుపుతారు. ఈ సందర్భంగా మొదట ఆయన హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించుకుంటారు. భూమిపూజ కార్యక్రమానికి ఆలయ ట్రస్టు 175 మందికి ఆహ్వానాలు పంపించింది. వీరిలో వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన 135 మంది సాధువులు ఉన్నారు. బీజేపీ కురువృద్ధ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, న్యాయవాది పరాశరన్‌ తదితర ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన మీదటే ఆహ్వాన జాబితా రూపొందించినట్లు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన సాధువులు శ్రీరామ్‌ అని తమిళంలో రాసి ఉన్న 5 కిలోల బరువైన బంగారు ఇటుక, 20 కిలోల వెండి ఇటుకను ఆలయ ట్రస్టుకు బహూకరించారని ఆయన వెల్లడించారు.
       
బుధవారం ఉ.9.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని

  • 10.35 గంటలకు లక్నో విమానాశ్రయానికి
  • 10.40 గంటలకు హెలికాప్టర్‌లో అయోధ్యకు
  • 11.30 గంటలకు అయోధ్యలోని సాకేత్‌ విమానాశ్రయానికి
  • 11.40 గంటలకు హనుమాన్‌ గర్హిలో పూజలు
  • 12 గంటలకు రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం
  • 12.15 గంటలకు ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో మొక్క నాటుతారు
  • 12.30 గంటలకు భూమిపూజ ప్రారంభం
  • 12.40 గంటలకు భూమిపూజ పునాదిరాయి పూజ
  • 1.10 గంటలకు స్వామి నృత్యగోపాల్‌ దాస్‌ తదితర రామజన్మభూమి ట్రస్టు సభ్యులతో సమావేశం
  • 2.05 గంటలకు అయోధ్య నుంచి  హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం
  • 2.20 గంటలకు లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణం.

    ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top