ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం

ASSOCHAM Said Farmers Protest Causing Daily Loss of Rs 3500 Crores - Sakshi

రైతుల ఉద్యమం వల్ల తీవ్ర నష్టం: అసోచామ్‌

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమం వల్ల పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాల్లో ప్రతి రోజు 3,000-3,500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని తెలిసింది. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థపై రైతుల ఆందోళన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని వాణిజ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అన్నదాతల ఆందోళనల వల్ల సరఫరా దెబ్బతినడంతో ఇప్పటికే రోజుకు దాదాపు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది. ఇకనైనా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రైతులను అభ్యర్థించింది. ఈ మేరకు అసోచామ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: కేరళలో ఏం జరుగుతుందో ఆలోచించారా?)

‘‘తాజాగా జరుగుతున్న ఆందోళనలు పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు 18లక్షల కోట్లు రూపాయలుగా ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్‌ప్రాసెసింగ్‌, జౌళి, ఆటోమొబైల్‌పైనే ఈ రాష్ట్రాల ఆదాయం ఆధారపడి ఉంది. అయితే రైతుల ఆందోళన, రహదారుల నిర్బంధంతో ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటో విభాగాలు, సైకిళ్లు, క్రీడా ఉత్పత్తులు, టెక్స్‌టైల్‌ ముడిసరుకుల పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాయి. ఫలితంగా రోజుకు 3000-3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది’’ అని అసోచామ్‌ తన ప్రకటనలో పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top