Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి మహిళా మంత్రి | Assam minister quits BJP after being denied election ticket | Sakshi
Sakshi News home page

Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి మహిళా మంత్రి

Mar 23 2026 10:19 AM | Updated on Mar 23 2026 12:44 PM

Assam minister quits BJP after being denied election ticket

గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం (మార్చి 22) ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

టికెట్ దక్కకపోవడమే కారణమా?
2022 నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.

త్యాగం చేసిన నిర్మల్.. కాంగ్రెస్ వ్యూహం
నందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత.. పార్టీలోకి రావడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మల్ తన సీటును త్యాగం చేశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.

సీఎం చర్చలు విఫలం?
నందిత పార్టీ మారడానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూస్తుంటే, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మంత్రి నందిత కాంగ్రెస్‌లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement