
జైసల్మీర్: రాజస్తాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఒక అధికారి చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన మేజర్ టీసీ భరద్వాజ్(33) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు అని అధికారులు తెలిపారు. ఈ ఘటన జైసల్మీర్ జిల్లాలోని గమ్నే వాలా గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్ వైపు నుంచి లొంగెవాలా వైపు వెళ్తున్న ఆర్మీ జిప్సీ వాహనం మూలమలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్ స్థాయి అధికారులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
వెంటనే వీరిని రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. భరద్వాజ్ అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షతగాత్రులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ రాయ్(33), మేజర్ అమిత్, మేజర్ ప్రాచీ శుక్లా, డ్రైవర్ జవాన్ నసీరుద్దీన్‌లను ప్రాథమిక చికిత్స అనంతరం జైసల్మీర్, జోధ్‌పూర్‌లలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మేజర్ ప్రాచీ శుక్లా తలకు, మేజర్ అమిత్ కుడి కన్ను వద్ద తీవ్ర గాయాలైనట్లు తనొత్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మేజర్ భరద్వాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆర్మీకి అప్పగించారు.