పెట్రో బాదుడు.. మెరుపు సమ్మెకు దిగిన గిగ్‌ వర్కర్లు | Gig Workers Announce Nationwide Strike Over Fuel Price Hike, Demand Higher Per Kilometre Pay For Delivery Workers | Sakshi
Sakshi News home page

పెట్రో బాదుడు.. మెరుపు సమ్మెకు దిగిన గిగ్‌ వర్కర్లు

May 16 2026 11:04 AM | Updated on May 16 2026 11:38 AM

Amid Petrol Hike Gig Workers Temporary Strike Details Here

పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ రేట్ల పెంపుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పెంపుతో ఇటు గిగ్ వర్కర్ల జీవనోపాధి మరింత కష్టాల్లో పడింది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని కార్మికులు ఒంటరిగా భరించలేరని, ప్రభుత్వం-కంపెనీలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో మెరుపు సమ్మెకు గిగ్‌ వర్కర్ల అసోషియేషన్‌ పిలుపు ఇచ్చింది. 

ఇవాళ(శనివారం) యాప్‌ ఆధారిత సేవలను నిలిపివేయాలని  గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) నిర్ణయించింది. అయితే ఈ సమ్మె తాత్కాలికంగానే ఉండనుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ సేవలు బంద్‌ ఉంటాయని నిన్న రాత్రి ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేసింది. 

యూనియన్ అధ్యక్షురాలు సీమా సింగ్ మాట్లాడుతూ, “ఇప్పటికే వేసవిని లెక్క చేయకుండా పనిచేస్తున్న డెలివరీ వర్కర్లకు.. పెట్రో పెరుగుదల నేరుగా దెబ్బతీసింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈ భారాన్ని భరించలేరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలోమీటరుకు రూ.20 చెల్లించేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా చెబుతోంది ఏంటంటే..  దేశవ్యాప్తంగా సుమారు 1.4 కోట్ల గిగ్ వర్కర్లు మోటార్‌బైక్‌లు, స్కూటర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మహిళా కార్మికులు, డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది రోజుకు 10–14 గంటలు ట్రాఫిక్‌జామ్‌ల్లో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఇంధన ధరలతో పాటు వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ కంపెనీలు చెల్లింపులను తగినంతగా పెంచడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. 

గిగ్‌ వర్కర్లు ఇలా సమ్మె చేయడం ఇదేం కొత్త కాదు. వేతనాల పెంపు, ఉద్యోగ..సామాజిక భద్రతలు డిమాండ్లతో ఈ మధ్యకాలంలో ఒక్క పూట, ఒక్కరోజు సమ్మెలు చేశాయి కూడా. ఈ నేపథ్యంతో ప్రభుత్వాలకు మెమొరాండం సమర్పించి, డెలివరీ ఛార్జీలు, కిలోమీటరు రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, డున్జో, అర్బన్ కంపెనీ, ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, అమెజాన్ ఫ్లెక్స్, ఇన్‌స్టామార్ట్ వంటి యాప్ ఆధారిత సంస్థలకు కూడా యూనియన్ లేఖలు పంపింది. పెరిగిన ఇంధన ఖర్చులను కార్మికులపై మోపకుండా, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు ఇప్పటికే అస్థిరంగా ఉన్న వేతనాలను మరింత తగ్గిస్తాయని, దీనివల్ల గిగ్ వర్కర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది.  

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడింది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే 11 వారాల పాటు ఆయిల్‌ కంపెనీలు నష్టాల్ని భరించుకుంటూ వస్తుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌కు లీటర్‌కు రూ.3 చొప్పున రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, 2022 తర్వాత పెట్రోల్‌ రేట్లు పెరగడం ఇదే కాగా.. అదీ రూ.3 పెంచడం ఆందోళనకు దారి తీసింది.

Advertisement
 
Advertisement
Advertisement