‘విక్రాంత్‌’ వచ్చేస్తోంది

Aircraft carrier Vikrant sets sail for sea trials - Sakshi

త్వరలో తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలోకి..

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యుద్ధ విమాన వాహక నౌక

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్‌ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్‌ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్‌ సేవలందించనుంది.

సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్‌.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్‌ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్‌ క్లాస్‌ నౌక ఇది. 1997లో విక్రాంత్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో విక్రాంత్‌ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది.

విక్రాంత్‌ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్‌ నేవీకి చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ సంస్థ నౌక డిజైన్‌ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్‌ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్‌ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్‌ ట్రయల్స్‌ పూర్తి చేశారు.

తొలిసారిగా సముద్ర విహారం
ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్‌ సీట్రయల్‌ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్‌ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్‌ఎం 2500 గ్యాస్‌ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్‌ ప్రొపైల్లర్‌ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్‌ పంప్స్, విద్యుత్‌ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్‌ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు.

చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన
న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌–ఐఏసీ) విక్రాంత్‌.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్‌ ట్రయల్స్‌ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్‌ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది.

భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్‌ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మథ్వాల్‌ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది.

కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్‌
రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్‌ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్‌. విక్రాంత్‌ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్‌ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్‌ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది.  
  
 – వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుద్దూర్‌ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top