అమిత్‌ షా వద్దకు చేరిన తమిళనాడు సీట్ల పంచాయితీ

AIADMK Finales Seat Sharing Agreement With PMK, In Talks With BJP - Sakshi

60 స్థానాలు కావాలంటున్న బీజేపీ  

21తో సర్దుకోవాలని అన్నాడీఎంకే స్పష్టీకరణ 

సందిగ్ధంలో డీఎండీకే

సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిలో అసెంబ్లీ సీట్ల పంపకం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. తమకు 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతుండగా, 21 సీట్లే ఇస్తామని, వాటితోనే సర్దుకోవాలని అన్నాడీఎంకే చెబుతోంది. బీజేపీ మెట్టు దిగడం లేదు. దీంతో సీట్ల పంచాయితీ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వద్దకు వెళ్లింది. తమకు కేవలం 10 సీట్లే కేటాయిస్తామని అన్నాడీఎంకే చెప్పడంతో విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే సందిగ్ధంలో పడింది.

అన్నాడీఎంకే, బీజేపీ, రాందాసు నేతృత్వంలో పీఎంకే, విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, జీకే వాసన్‌ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ పార్టీలు తమిళనాడులో గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక కూటమిగా కలిసి ప్రయాణించాయి. ఇదే కూటమి తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. అయితే, సీట్ల పందేరం కూటమిలో వివాదాలు సృష్టిస్తోంది. మిత్రపక్షాలు అధిక సీట్లు డిమాండ్‌ చేస్తుండడంతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్‌ పళనిస్వామి డైలమాలో పడ్డారు. ఇప్పటికే పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌ ఖరారు చేశారు.

సీట్ల కోసం పార్టీల పట్టు  
రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కనీసం 170 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని స్టాలిన్‌ నేతృత్వంలో ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే తమ అభ్యర్థులను సైతం బరిలోకి దించాలని అధికార అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కానీ, కూటమిలో సీట్ల సర్దుబాటే ఎటూ తేలడం లేదు. ప్రధానంగా బీజేపీ 60 సీట్లను ఆశిస్తుండడంతో సమన్వయ కమిటీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీకి 21 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, బీజేపీ రాష్ట్ర నేతలు ఒప్పుకోవడం లేదు. పుదుచ్చేరి, విల్లుపురంలో ఎన్నికల ప్రచారం కోసం చెన్నైకు వచ్చిన అమిత్‌ షాతో ఆదివారం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్‌ బృందం గంటన్నరకు పైగా భేటీ కావడం గమనార్హం.

ఎంపిక చేసిన 60 స్థానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను వారు అమిత్‌ షా ముందు ఉంచినట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా సీట్లను అన్నాడీఎంకే నుంచి రాబట్టుకునే దిశగా ఆ పార్టీ సమన్వయ కమిటీతో అమిత్‌ షా మాట్లాడినట్టు సమాచారం. సీట్ల పంపకం లెక్కలు సోమవారం లేదా మంగళవారం నాటికి తేలవచ్చని కమలనాథులు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు కేవలం 10 సీట్లు ఇస్తామనడం డీఎండీకేకు రుచించడం లేదు. తాము ఒంటరిగా పోటీ చేసినా పది శాతానికి పైగా ఓట్లను చీల్చగలమని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ చెబుతున్నారు. దీంతో కూటమిలో ఆ పార్టీ కొనసాగేనా అన్న చర్చ మొదలైంది. 

చదవండి: (తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!)

(నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top