జీవితంలో మొదటి అనుభవం ఎవరికీ మరిచిపోలేనిది. అది ప్రేమైనా.. ఉద్యోగమైనా.. మరొకటైనా!. అయితే ఇక్కడో వ్యక్తికి అది మనషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.. వాళ్లు ఎప్పటికీ మారరనే సంగతి గుర్తించేందుకు ఉపయోగపడింది. రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలను పరిశీలిస్తే..
ఓ వ్యక్తి బెంగళూర్ ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చున్న వ్యక్తి అతనికి పరిచయంలా అనిపించి దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే.. 18 ఏళ్ల కిందట తాను జాబ్ కెరీర్ మొదలుపెట్టింది మేనేజర్ ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్ కూడా అతన్ని గుర్తు పట్టి పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు.
ఇంతలో ఆ వ్యక్తి ఆ పెద్దాయన్ని ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్‌గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్‌మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు..
2008లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేరిన ఆ వ్యక్తి.. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలు అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయట. అయితే.. కంపెనీని వీడే టైంలో హెచ్‌ఆర్ నిజాయితీగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని అడిగితే.. అంతే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు అతను రాసుకొచ్చాడట. అది చూసి మూడు నెలల నోటీసు పీరియడ్ కూడా అక్కర్లేకుండా ఆ కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది. కానీ..
అతనికి రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇదే విషయమై అతని మేనేజర్‌ను నిలదీస్తే.. చూద్దాం.. చేద్దాం.. అంటూ చెబుతూ వచ్చాడు. చివరకు ఆ ఫాలోఅప్ విషయంలో మౌనం వహించుకుంటూ వచ్చాడట. విసుగెత్తిపోయిన ఆ యువకుడు అది మరిచిపోయి.. ఎలాగోలా మరో జాబ్ సంపాదించుకోగలిగాడు. కట్ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్‌ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్‌చుప్‌గా వెళ్లిపోయారట.
ఈ సంఘటన రెడ్డిట్‌లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్ అయ్యింది. వెంటనే వైరల్ అయింది.దీంతో ఆ ఫీడ్‌బ్యాక్‌లో మేనేజర్ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్‌లో, మేనేజర్ రియాక్షన్ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్, మేనేజీరియల్ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత (Accountability) చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత అసౌకర్యంగా మారుతుంది. ఈ ఉద్యోగి వైరల్ కథలోలాగా!.


