శానిటరీ నాప్కిన్స్‌.. సగం మందికే తెలుసు

About 50 per cent of womens use cloth for menstrual protection - Sakshi

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఆధునిక కాలంలోనూ దేశంలో చాలామంది మహిళలకు శానిటరీ నాప్కిన్స్‌/ప్యాడ్స్‌ గురించి తెలియదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 15–24 ఏళ్ల మహిళల్లో 50 శాతం మంది ఇప్పటికీ నాప్కిన్స్‌ బదులు గుడ్డలు వాడుతున్నట్లు  తేలింది. అవగాహన లేమి, రుతుస్రావంపై మూఢ నమ్మకాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా లేని గుడ్డలు ఉపయోగిస్తుండడం వల్ల మహిళలు రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు గుర్తించారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 సర్వే ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు.

2019–21 వరకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 707 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. 15–24 ఏళ్ల వయసున్న మహిళలను ప్రశ్నించారు. రుతుస్రావ సమయంలో మామూలు గుడ్డలే వాడుతున్నట్లు 50 శాతం మంది బదులిచ్చారు. స్థానికంగా తయారు చేసిన నాప్కిన్లు వాడుతున్నట్లు 15 శాతం మంది చెప్పారు. అపరిశుభ్ర పద్ధతులు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గురుగ్రామ్‌లో సీకే బిర్లా హాస్పిటల్‌ వైద్యురాలు డాక్టర్‌ ఆస్తా దయాల్‌ చెప్పారు. గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భిణుల్లోనూ అనారోగ్య సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు.

బిహార్‌లో అత్యల్పం
నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది మహిళలు శానిటరీ నాప్కిన్లు ఉపయోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 73 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యల్పంగా బిహార్‌లో 59 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 61 శాతం, మేఘాలయాలో 65 శాతం మంది నాప్కిన్లు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన(పీఎంబీజేపీ)ని ప్రారంభించింది. ఈ పథకం దేశవ్యాప్తంగా మహిళలకు కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్‌ అందిస్తున్నట్లు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్, సామాజిక ఉద్యమకారిణి రంజనా కుమారి తెలిపారు. శానిటరీ ప్యాడ్‌ వినియోగించే విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top