
న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాలు నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో, ఢిల్లీ విశ్వవిద్యాలయం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థాగత ప్రాధాన్యతలు, విద్యావేత్తల పని పరిస్థితులపై సాగుతున్న చర్చలను మరింత తీవ్రతరం చేసింది. అలాగే ఈ నిర్ణయం నిర్మాణాత్మక మార్పుల అమలుకు దోహదపడుతుందని, క్యాంపస్‌లలో విద్యావాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని బోధనా సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
ఢిల్లీ విశ్వవిద్యాలయం తన తాజా ఉత్తర్వులలో వర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలలు,అనుబంధ సంస్థలు సాధారణ పని దినాలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య పనిచేయాలని అధికారికంగా ఆదేశించింది. జూలై 31న జారీ చేసిన ఈ ఆదేశంలో.. వనరులను ఉత్తమంగా ఉపయోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే పని గంటలను పెంచాలనే ఈ ఆదేశం వర్శిటీలోని అన్ని విభాగాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. జూలై 12న జరిగిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
పొడిగించిన ఈ పని గంటలను సమర్థవంతంగా ఉపయోగిచుకునేందుకు అధ్యాపకులు, సిబ్బంది ముందుకు రావాలని విశ్వవిద్యాలయం సూచించింది. కొత్త విద్యా సంవత్సరానికి ముందు నుంచే ఈ విధానం అమలుకానుంది. మరోవైపు ఈ నూతన విద్యాసంవత్సరం(2025-26) నుంచే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) ప్రారంభం కానుంది. సీనియర్ రెగ్యులర్ ఫ్యాకల్టీకి నాల్గవ ఏడాది విద్యార్థులకు బోధనా బాధ్యతలు అప్పగించనున్నట్లు తాజా నోటిఫికేషన్‌లో వర్శిటీ పేర్కొంది.
ఢిల్లీ విశ్వవిద్యాలయం జారీ చేసిన ఆదేశంపై అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అసాధ్యమని, బోధనా సిబ్బందికి, విద్యార్థులకు హానికరం అని అధ్యాపకులు అంటున్నారు. అలాగే ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కళాశాలలకు దూరంగా ఉన్న అధ్యాపకులకు, విద్యార్థులకు ఇది సమస్యగా మారనున్నదనే వాదన వినిపిస్తోంది.