
దశాబ్ద కాలంలో రూ.10,000 కోట్లకుపైగా నష్టం
ఇవన్నీ ఏఏఐ నిర్వహణలో ఉన్న ఎయిర్‌పోర్టులే
టాప్–10లో బేగంపేట, విజయవాడ, తిరుపతి
ఏపీ, తెలంగాణలో నష్టాల్లో 7 ఎయిర్‌పోర్టులు
భారతీయ విమానాశ్రయాల నుంచి ఏటా కోట్ల మంది దేశ, విదేశాలకు విమానయానం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులూ పెరిగాయి. ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విమానాశ్రయాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు విస్తరించాయి. వీటి వ్యాపారం, ప్రయాణికుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఫీజు, ఇతర ఆదాయాలతో విమానాశ్రయాలు లాభాల జడివానలో తడిసిపోతున్నాయి అనుకుంటే పొరపాటే. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ) నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి.
దశాబ్ద కాలంలో ఇవి రూ.10 వేల కోట్లకుపైగా నష్టాన్ని మూటగట్టుకోవడం గమనార్హం. వీటిలో 22 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏఏఐ ఎయిర్‌పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ఉన్నాయి.
ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015–2016 నుంచి 2024–2025 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం రూ.10,852.9 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం అత్యధికంగా రూ.673.91 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో అగర్తల, బేగంపేట (హైదరాబాద్), డెహ్రాడూన్, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి.
రూ.363 కోట్ల నష్టంతో తిరుపతి 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రూ.339.16 కోట్లు, కడప రూ.103.39 కోట్లు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ రూ.1.84 కోట్లు, తెలంగాణలోని వరంగల్ రూ.5.76 కోట్ల నష్టాన్ని నమోదుచేశాయి. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాలు కార్యకలాపాలు సాగించడం లేదు. ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీవీఐపీలను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.
13 కోట్లకు పైచిలుకు..
ఏఏఐ ఖాతాలో దేశవ్యాప్తంగా మొత్తం 133 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఇందులో 35 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రెండు జాయింట్ వెంచర్, ఆరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విమానాశ్రయాలు మినహా.. మిగిలిన ఎయిర్‌పోర్టుల నుంచి 2023–24లో 13 కోట్లకుపైచిలుకు ప్రయా ణికులు దేశ, విదేశాలకు రాకపోకలు సాగించారు. 6.88 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అయింది.
బేగంపేటలో ఇలా..
ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు నడపడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గానూ ఈ ఎయిర్‌పోర్ట్ సేవలు అందిస్తోంది. అలాగే ప్రైవేట్ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి విరివిగా నడుస్తున్నాయి. 2008 మార్చి 23న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనకు రెండేళ్లకోసారి బేగంపేట విమానాశ్రయం వేదిక అవుతోంది.
రూ.96 వేల కోట్ల వ్యయం
ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్‌పోర్టులు, ఉన్న వాటి విస్తరణ, కొత్త టెర్మినళ్లు, ఇతర సౌకర్యాల కల్పన వంటి వాటికోసం 2019–20 నుంచి 2024–25 మధ్య ఏఏఐ, పీపీపీ భాగస్వాములు కలిపి రూ.96,000 కోట్ల మూలధన వ్యయం చేశాయి. ఇందులో ఏఏఐ వాటా రూ.25,000 కోట్లు.
తెలుగు రాష్ట్రాల్లో మూడు..
మూతపడ్డ విమానాశ్రయాల్లో తెలంగాణ నుంచి నాదర్‌గుల్, వరంగల్; ఏపీ నుంచి దొనకొండ ఉన్నాయి.
ఉడాన్ పథకంతో..
దేశంలోని సేవలు లేని, తక్కువ సేవలు అందిస్తున్న విమానాశ్రయాల నుంచి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని పెంచడానికి 2016 అక్టోబర్ 21న ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఆర్‌సీఎస్–ఉడాన్ ) పథకం ప్రారంభమైంది. నిర్వహణ ఖర్చులు, అంచనా ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విమానాశ్రయ నిర్వాహకుల నుంచి విమానయాన సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయి. తద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించి వారి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చన్నది ప్రభుత్వ భావన. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌సీఎస్–ఉడాన్ కోసం కేంద్రం రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 15 హెలిపోర్ట్‌లు, రెండు వాటర్ ఏరోడ్రోమ్స్ సహా మొత్తం 92 సేవలు లేని, తక్కువ సేవలు అందించే విమానాశ్రయాలను ఉడాన్ కింద పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకొచ్చారు.