స్మార్ట్‌గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా

75percent smartphone users suffers from Nomophobia - Sakshi

ఫోన్‌ లేకుండా క్షణం కూడా ఉండలేని వారు 75%

న్యూఢిల్లీ: స్మార్ట్‌ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్‌ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్‌ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని  ఒప్పొ, కౌంటర్‌పాయింట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్‌ ఫోబియా అని అర్థం.

స్మార్ట్‌ ఫోన్‌ పని చేయకపోయినా, సిగ్నల్స్‌ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్‌ 1, టైర్‌ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్‌ కోసం స్మార్ట్‌ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ దమయంత్‌ సింగ్‌ ఖనోరియా చెప్పారు.  

► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్‌ ఫోన్లు మార్చుకున్నారు
► ఫోన్‌ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు
► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్‌ సేవింగ్‌ మోడ్‌ని వినియోగిస్తున్నారు
► చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్‌ వాడే వారు 87% మంది ఉన్నారు
► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్‌ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్‌ మీడియాదే అగ్రస్థానం.  
► స్మార్ట్‌ ఫోన్‌ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న  దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top