అట్టహాసంగా ముగిసిన నాగపూర్‌ ఫార్మసీ కాంగ్రెస్‌.. హైదరాబాద్‌లో నెక్స్ట్‌ మహాసభలు

72nd Indian Pharmaceuticals Congress Held At Nagpur - Sakshi

నాగ్‌పూర్‌లో 72వ భారతీయ ఫార్మసీ మహాసభలు

వచ్చే సమావేశాలు వేదిక హైదరాబాద్‌

సాక్షి, నాగ్‌పూర్‌: కోవిడ్‌ మహమ్మారి సమయంలో డాక్టర్లు, నర్సులతో సమానంగా ఫార్మసిస్టులు తమ బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. నాగ్‌పూర్‌లో ఇటీవలే ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభలు జరగ్గా.. కొద్ది రోజులకే ఇండియన్‌ ఫార్మసీ కాంగ్రెస్‌ మహాసభలు ఇంత పెద్ద ఎత్తున జరగడం అభినందనీయమన్నారు గడ్కరీ.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అసోషియేషన్‌ తరపున  72వ భారతీయ ఫార్మస్యూటికల్‌ కాంగ్రెస్‌ మహాసభలు జరిగాయి.  జనవరి 20వ తేదీన ప్రారంభం కాగా, కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభోపన్యాసం చేశారు. ఇవాళ్టితో( 22 తేదీతో) మహాసభలు ముగిశాయి. ముగింపు సమావేశాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ హాజరయ్యారు.

డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ VG సోమాని అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో "యాక్సెస్‌ టు క్వాలిటీ అండ్‌ అఫర్డబుల్‌ మెడికల్‌ ప్రోడక్ట్స్‌" అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సభలకు దేశవ్యాప్తంగా పదివేల మంది ఫార్మసీ విద్యార్థులు, రెండున్నర వేల మంది శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, ఫార్మసీ పరిశ్రమల యజమానులు హాజరయ్యారు.

ఈ సభల వేదికగా తమ వార్షిక నివేదికను సమర్పించారు ఐపీసీఏ సెక్రటరీ జనరల్‌, ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ టీవీ నారాయణ. భారతీయ ఫార్మసీ రంగ పరిణామ క్రమాన్ని తన నివేదికలో సవివరంగా తెలిపారు. కోవిడ్‌ సమయంలో మన దేశం ప్రపంచానికి కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లను అందించిందని, దాని వెనక ఇండియన్‌ ఫార్మసీల ఘనత ఉందని కొనియాడారు టీవీ నారాయణ. 


తెలంగాణ నుంచి హాజరైన ఫార్మా ప్రతినిధులు

ఈ మహాసభల్లో భారత్‌ బయోటెక్‌ అధినేత, పద్మభూషణ్‌ కృష్ణ ఎల్లా, ప్రపంచ ఫార్మసీ సమాఖ్య అధ్యక్షులు డామ్నిక్‌ జోర్డాన్‌, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు డాక్టర్‌ మోంటు పటేల్‌, కామన్‌ వెల్త్‌ దేశాల ఫార్మసీ సంఘ పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ రావు వడ్లమూడి, నాగ్‌పూర్‌ సభల ఫార్మసీ కాంగ్రెస్‌ నిర్వహణ ఛైర్మన్‌ అతుల్‌ మండ్లేకర్‌, మహాసభల కార్యదర్శి ప్రొఫెసర్‌ మిలింద్‌ ఉమేకర్‌, ఐపీసీఏ కోశాధికారి డాక్టర్‌ సి.రమేష్‌, ఇతర ఫార్మసీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఫార్మసీ అభ్యసిస్తోన్న వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

ముగింపు కార్యక్రమ ముఖ్యఅతిథి ఫడ్నవీస్‌
నాగ్‌పూర్‌ వేదికగా మూడు రోజులుగా జరిగిన ఫార్మసీ కాంగ్రెస్‌ సభల్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరయ్యారు. వంద సంవత్సరాల నాగ్‌పూర్‌ యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌ పూర్వ విద్యార్థులు వెలువరించిన ప్రత్యేక సంచికను ఫడ్నవీస్‌ ఆవిష్కరించారు. 

వచ్చే ఏడాది మహాసభలకు వేదిక హైదరాబాద్‌
జనవరి 2024లో జరగనున్న 73వ భారతీయ ఫార్మసీ కాంగ్రెస్‌ మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఏ అధ్యక్షులు టీవీ నారాయణ ప్రకటించారు. తెలంగాణ ఐపీఏ అధ్యక్షులు డాక్టర్‌ బి.ప్రభాశంకర్‌ అధ్వర్యంలో జరిగే ఈ మహా సభలకు దేశవ్యాప్తంగా 15 వేల మంది ఫార్మసీ విద్యార్థులు, ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఫార్మసీ కళాశాలల సంఘ నాయకులు డాక్టర్‌ కె.రామదాసు, టి. జైపాల్‌రెడ్డి, పుల్లా రమేష్‌ బాబు, ఏ.ప్రభాకర్‌రెడ్డి, మొలుగు నరసింహారెడ్డి, బొమ్మా శ్రీధర్‌, మధుసూధన్‌రెడ్డి, ఇతర ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top