కర్ణాటకలో పేలుడు బీభత్సం

5 people dead in mega explosion in Karnataka - Sakshi

ఐదుగురు కార్మికులు మృతి 

పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు 

ప్రధాని మోదీ సంతాపం

శివమొగ్గ: కర్ణాటకలో శివమొగ్గ జిల్లా కేంద్రానికి సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు మాత్రం ఆరుగురు చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొరుగునున్న దావణగెరె, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఓ మోస్తరు భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భూకంప భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా సానుభూతి తెలిపారు.

గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కొందరు కార్మికులు లారీలో సుమారు 50 బాక్స్‌ల డైనమైట్లు, జిలెటిన్‌ కడ్డీలను వేసుకుని వస్తుండగా పేలుడు చోటుచేసుకుంది. ఆ తీవ్రతకు లారీ ఆనవాళ్లు లేకుండా పోయింది. మృతదేహాలు మాంసం ముద్దలుగా అర కిలోమీటర్‌ దూరం వరకు  పడిపోయా యి. సమీపంలో ఉన్న బోలెరో వాహనం కాలి బూడిదైంది. చుట్టుపక్కల ఉన్న విద్యుత్‌ లైన్ల వైర్లు తెగిపడ్డాయి. ఆ ప్రాంతంలో మంటలతో పాటు కొండలా దట్టమైన దుమ్ము ధూళి కమ్ముకుంది. ఇక్కడ పని చేస్తున్న వారిలో అనేక మంది కార్మికులు బిహార్, అసోంకు చెందిన వారని స్థానికులు తెలిపారు.

కనీసం ఆరుగురు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా కనీసం 10–15 మంది చనిపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. కాగా, మృతుల్లో ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంనకు చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. క్రషర్‌ యజమాని సుధాకర్, క్వారీ నిర్వాహకుడు నరసింహ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top