చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేశారనే ఆరోపణలతో 25 మంది విదేశీ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైతో పాటు మదురై విమానాశ్రయాల్లో వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల నడుమ మిత్రపక్షాల మద్దతుతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడు ఆ ఎన్నికల్లో నకీలీ ఓట్లు వేసిన 25 మంది విదేశీయులను అధికారులు పట్టుకున్నారు.
ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులకు చేతిపై ఎలక్షన్ సిరా ఉండడం గుర్తించారు. దీంతో అనుమానం వచ్చన అధికారులు ఇది ఎలా చేతికి వచ్చిందని విచారణ చేయగా వారు అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది. వీరంతా శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తులు. విదేశీ పాస్‌పోర్ట్‌లు ఉన్నప్పటికీ, పాత ఓటర్ ఐడిలను ఉపయోగించి వీరు ఓటు వేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
వీరు చెన్నైలోని పెరంబూర్, కె.కె. నగర్ మరియు పట్టుక్కోట్టై వంటి నియోజకవర్గాల్లో ఓట్లు వేసినట్లు మరికొందరు పుదుచ్చేరిలో సైతం ఓట్లు వేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.వీరిపై 'భారతీయ న్యాయ సంహిత, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా భారత ఎన్నికల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరం.


