తంజావూరు రథోత్సవంలో విషాదం

11 Killed In Electrocution During Temple Chariot Procession - Sakshi

రథంపై హైపర్‌ టెన్షన్‌ విద్యుత్‌ తీగలు పడి 11 మంది మృతి

సాక్షి, చైన్నై: తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు రథంపై పడడంతో 11 మంది మరణించారు.  తంజావూరు జిల్లా కలిమేడులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్‌ స్వామి మఠం ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు అప్పర్‌ సత్య జాతరని  నిర్వహిస్తుంది. మహాశివుడికి ప్రతిరూపంగా కొలిచే ఈ అప్పర్‌ ఆలయానికి చెందిన పండుగలో రెండో రోజు బుధవారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. 

తంజావూర్‌–బూదలూర్‌ రహదారిపై రథం వెళుతుండగా తెల్లవారుజాముయ సుమారు 3 గంటల సమయంలో రథం పైభాగంలో 20 అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్‌ షాక్‌ కొట్టింది. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మృతుల్లో 13, 14, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, తండ్రీ, కుమారుడు ఉన్నారు. కరెంట్‌ షాక్‌ కొట్టిన వెంటనే రథాన్ని లాగుతున్న కొందరు భక్తులు కుప్పకూలిపోయారు. కరెంట్‌ షాక్‌కి మంటలు వ్యాపించడంతో రథం నిలువునా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘటనకి రథోత్సవం తిలకించడానికి వచ్చిన ప్రజలు బెదిరిపోయారు. చెల్లాచెదురుగా పరుగులు తీస్తూ హాహాకారాలు చేశారు.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన కుటుంబాలకు రూ.50 వేలు సహాయంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తంజావూరు వెళ్లి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు.  మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, డీఎంకే తరపున తలా రూ.2 లక్షలు సాయంగా అందజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top