నారాయణపేట: జిల్లాలోని రైస్ మిల్లర్లు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యాన్ని విక్రయించాలని జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ సైదులు, డీఎస్‌ఓ బాలరాజు సూచించారు. సోమవారం పౌర సరఫరాలశాఖ, రెవెన్యూ, కొలతలు, తూనికలశాఖ అధికారులు జిల్లాలోని పలు రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విక్రయ ధరలతో పాటు తూకం, కొలతలను పరిశీలించారు. జిల్లాలో బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయని.. ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. నిర్ణీత ధరలకు మించి బియ్యాన్ని విక్రయించినా, తూకంలో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం బీపీటీ, కేఎన్‌ఎం రకం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాలు రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకాలకు రూ.79 ధరలు నిర్దేశించినట్లు తెలిపారు. ప్రతి దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని వ్యాపారులకు సూచించారు. వినియోగదారులు బియ్యం కొనుగోలు సమయంలో నిర్ణీత ధరలను పరిశీలించాలని.. అధిక ధర వసూలు చేసినా, తూకంలో మోసం జరిగినా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు.


