ప్రధాన డిమాండ్లు ఇవే..
● 21 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం
ఉద్యోగుల నిరవధిక సమ్మె
● కుటుంబాలకు భరోసా,
ఉద్యోగ భద్రత కోసం ఆందోళన
● న్యాయమైన డిమాండ్లు
నెరవేర్చాలని నిరసనలు
● ఉద్యోగుల సమ్మెతో
వైద్యసేవల్లో ఇబ్బందులు
నారాయణపేట: అనారోగ్యానికి గురయ్యే వారికి అవసరమైన వైద్యం అందించే చేతులు అవి.. ప్రమాదంలో గాయపడితే ప్రాణాలు నిలిపే బాధ్యత వారిది.. గర్భిణులకు అండగా నిలుస్తూ, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే సేవలు వారివి.. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేశారు.. ఇలా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల జీవితాల్లో నేటికీ ఉద్యోగ భద్రత కరువైంది. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నా.. తమ కుటుంబాల భవిష్యత్‌కు ఏమాత్రం భరోసా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అనారోగ్య ఖర్చుల మధ్య అభద్రతతో కాలం వెల్లదీస్తున్నామని వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఈ నెల 13 నుంచి చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సమ్మెలో 236 మంది ఉద్యోగులు..
జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు 236 మంది ఆందోళనబాట పట్టారు. వీరిలో 51 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, 8 మంది ఆర్‌బీఎస్‌కే వైద్యులతో పాటు ఏడుగురు ఫార్మసిస్టులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ల్యాబ్ మేనేజర్, 13 మంది కాంటింజెంట్ సిబ్బంది, 70 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు, 55 మంది స్టాఫ్ నర్సులు, ఐదుగురు ఆర్‌బీఎస్‌కే ఏఎన్‌ఎంలు, ఐదుగురు యూపీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు, మరో 18 మంది ఇతర సిబ్బంది ఉన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
ప్రతి కేడర్‌కు వేతన నిర్ధారణ చేసి, 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.
జీవో 1195 ప్రకారం వేతనాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి.
కాంట్రాక్టు ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ విధానంలోకి మార్చకుండా, స్టేట్ హెల్త్ సొసైటీ ద్వారానే వేతనాలు చెల్లించాలి.
ప్రతినెలా ఐదో తేదీలోగా వేతనాలు విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ మంజూరు చేయాలి.
ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (జీపీఏఐఎస్) వర్తింపజేయాలి.
మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి.
విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే, కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కల్పించాలి.


