● అత్యధికంగా లా, ఇంజినీరింగ్ కళాశాలలకు కేటాయింపు
● త్వరలో రోస్టర్, నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రతిపాదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఇటీవల జీఓ 31ని విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా డిపార్టుమెంట్ల వారీగా భర్తీ చేసే పోస్టులకు అనుమతిస్తూ జీఓ 142 జారీచేసింది. మొత్తం పీయూలోని 19 డిపార్ట్మెంట్లలో 152 పోస్టులు ఉండగా ఇందులో ప్రస్తుతం రెగ్యులర్ ప్రతిపాదికన 18 మంది పనిచేస్తుండగా.. 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం 45 పోస్టులకు మాత్రమే భర్తీకి అనుమతించింది. అయితే కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్న మెజార్టీ డిపార్ట్మెంట్లలో ప్రభుత్వం రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయడంపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పీయూలో కొత్తగా ప్రారంభించిన లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో లాలో 8, ఇంజినీరింగ్లో మూడు డిపార్ట్మెంట్లలో 23 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. యూనివర్సిటీ పరిధిలో భర్తీ చేయనున్న పోస్టులు కావడంతో వాటికి సంబంధించి రోస్టర్, నోటిఫికేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. అంతేకాకుండా ఈ ప్రక్రియను మార్చిలోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పలు కమిటీలను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
డిపార్ట్మెంట్ పోస్టులు
బాటనీ 2
బిజినెస్ మేనేజ్మెంట్ 1
ఇంగ్లిష్ 4
మేథమెటిక్స్ 1
లా ( ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం) 8
ఇంజినీరింగ్ సీఎస్ఈ 6
ఇంజినీరింగ్– సీఎస్సీ డాటాసైన్స్ 6
ఇంజినీరింగ్ (హ్యూమనిటీస్, 10
సోషల్ సైన్స్)
ఇంజినీరింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1


