● ఆశాలు, అంగన్‌వాడీలు,ఆర్పీల సేవలు అభినందనీయం
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
నారాయణపేట: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశ సమగ్ర ప్రగతి సాధ్యమవుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. మహాత్మాగాంధీ జయంతి, ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్‌శ్రీలో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రీ గార్డెనన్స్‌లో నిర్వహించిన క్షేత్రస్థాయి మహిళా సిబ్బంది సన్మాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చడంలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు కీలకమని కొనియాడారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం వంటి రంగాల్లో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే గ్రామాల అభివృద్ధి అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఫ్రంట్‌లైన్ సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. నారాయణపేటను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్‌పర్సన్ మంజుల, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సిద్ధప్ప, బీజేపీ నాయకులు రతంగ్‌పాండురెడ్డి, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, విమల తదితరులు పాల్గొన్నారు.


