నారాయణపేట: పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు సూర్యశక్తిని ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని విద్యుత్‌శాఖ డీఈ (టెక్నికల్) రాజునాయక్ సూచించారు. శుక్రవారం నారాయణపేట విద్యుత్‌శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సేవా సేతు అభియాన్‌లో భాగంగా సోలార్ వినియోగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్‌బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకొని విద్యుదుత్పత్తి చేసుకోవాలని సూచించారు. సోలార్ ఏర్పాటు, విద్యుత్ వినియోగం, బ్యాంకు రుణాలు, పరికరాల ఎంపిక తదితర అంశాలపై అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, సోలార్ వెండర్లు అవగాహన కల్పించారు. సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం గరిష్టంగా రూ.78 వేల వరకు రాయితీ అందిస్తుందని.. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ఉంటుందని వివరించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. శని, ఆదివారం కూడా టీజీఎస్పీడీసీఎల్, టీఎస్ రెడ్కో మహబూబ్‌నగర్, ఎస్‌బీఐ, సోలార్ వెండర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఈ బి.నవీన్‌కుమార్, డీఈ ఆపరేషన్‌న్స్ వి.శ్రీనివాస్, ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ శరత్‌కుమార్, సోలార్ వెండర్లు వినయ్‌కుమార్, డి.చంద్రశేఖర్, ఎం.శ్రీకాంత్, ఏఈలు మహే ష్‌గౌడ్, వెంకటకృష్ణారెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
నిలువురాళ్ల స్థల
అభివృద్ధికి సహకారం
నారాయణపేట: జాతీయ ప్రాధాన్యం కలిగిన ముడుమాల్ నిలువురాళ్ల స్థల సమగ్ర అభివృద్ధి, పరిరక్షణకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ వారసత్వశాఖ సంచాలకుడు ప్రొ. అర్జునన్‌రావు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ప్రొ. మణికొండ వేదకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరిహద్దులను గుర్తించడం, పరిరక్షణకు అవసరమైన భూ సేకరణ, బీటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలపై చర్చించి ప్రతిపాదనలు వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పర్యాటక మార్గదర్శకులకు శిక్షణ ఇవ్వడం, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ముడుమాల్‌లో ఏటా రెండు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించే అంశాలపై చర్చించామన్నారు. ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.
రేపు ‘ఎస్‌జీఎఫ్’ జట్ల
ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9.30కి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాలకు పీడీ భానుకిరణ్‌ను సంప్రదించాలన్నారు. అలాగే ఇండోర్ స్టేడియంలో ఈనెల 4వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17 విభాగాల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


