నారాయణపేట: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని రెవెన్యూ అదనపు శ్రీను అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ సామాజిక న్యాయం, హక్కుల కోసం ధైర్యంగా నిలిచారని తెలిపారు. మహిళా ధైర్యానికి, సామాజిక మార్పుకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, రజక సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
ఆకస్మిక తనిఖీ
దామరగిద్ద: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సిద్దప్ప శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఐశ్వర్యతో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వివిధ రికార్డులు, వ్యాక్సిన్ రూం ఐఎల్‌ఆర్‌ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట డా. సోహెల్, ఫార్మసిస్ట్ వెంకట్రామారెడ్డి, సూపర్‌వైజర్ భానుప్రియ, స్టాప్‌నర్సులు, చైల్డ్ హెల్త్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు.
ఏటీ ల్యాబ్‌లను వినియోగించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థుల ఆవిష్కరణలకు ఏటీ ల్యాబ్‌లు ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర గ్రామీణ సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌పై రాష్ట్రస్థాయి సామర్థ్య నిర్మాణ శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఏటీ ల్యాబ్‌లు ఉన్న 23 పాఠశాలలకుగాను 21 పాఠశాలల ఏటీఎల్ ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులు శిక్షణకు హాజరయ్యారు. పాఠశాలల్లోని ఏటీ ల్యాబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థుల్లో ఆవిష్కరణ స్ఫూర్తి, సృజనాత్మకతను పెంపొందించాలని, నూతన ఆవిష్కరణలకు ఏటీఎల్‌లు వేధిక కావాలని సూచించారు. ల్యాబ్‌లను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులలో ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. శిక్షణలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, సెన్సార్లు, బ్రెడ్ బోర్డు అనుసంధానం, ఆర్డుయినో పరిచయం, బ్లాక్ కోడింగ్, బ్లూటూత్‌తో వైర్‌లెస్ కమ్యూనికేషన్, 3డి డిజైనింగ్, 3డి ప్రింటింగ్ వినియోగం, ఏఐ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్, ఏటీఎల్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
కారణజన్ముడు
ఎస్పీ బాలు
నారాయణపేట: తెలుగుజాతి గర్వించదగ్గ గాయకుడు, బహుభాషా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని బాలు అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి కొనియాడారు. శనివారం బాలకేంద్రంలో బాలు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 50 వేలకు పైగా గీతాలను ఆలపించి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలు అన్నారు. ఆయన గాన ప్రతిభ, సేవలు కళాకారులకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సంగ నర్సింహులు, వసంత్, రామకృష్ణ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


