వారసత్వ సంపద సంరక్షణ బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వారసత్వ సంపద సంరక్షణ బాధ్యత

Sep 27 2026 1:22 AM | Updated on Sep 27 2026 1:22 AM

కృష్ణా: ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలువురాళ్లను కాపాడుకోవడం అందరి బాధ్యతని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. శనివారం మండలంలోని ముడుమాల్‌ నిలువురాళ్ల ప్రాంతంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆమె హాజరయ్యారు. ముందుగా ముడుమాల్‌, ధన్వాడ, దామరగిద్ద మండలాల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిలువురాళ్లు యునెస్కో గుర్తింపు పొందింతే ఈ ప్రాంతం అన్నిరకాలుగా అభివృద్ధి చెందడంతో పాటు నారాయణపేట అంటే ముడుమాల్‌ నిలువురాళ్లు అనేవిధంగా ఉంటుందన్నారు. తను చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ కేవలం 70 ఏళ్లకు చెందిన వాటిని కాపాడుకొని పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధిపర్చారని తెలిపారు. ఇక్కడి నిలువురాళ్లు 3 వేల సంవత్సరాలకు చెందినవి అంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా పురాతన ఆలయాలు, ఇతర కట్టడాలు ఉంటాయి.. కాని ఇక్కడ ఓ విజ్ఞానానికి సంబంధించినవి, కాలగమనానిని చెందినవి, పూర్వీకులు అవలంబించిన ఆనవాళ్లు ఉండటం చాలా అరుదని తెలిపారు. ముడుమాల్‌ నిలువురాళ్లు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందడం గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా ముడుమాల్‌ ప్రజలు వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిలువురాళ్ల ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తన సొంత నిధులతో వారంలోనే మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంత రైతులకు సంబంధించిన చిన్నచిన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని తెలిపారు.

నిలువురాళ్లను సందర్శించాలి..

జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు చారిత్రాత్మకమైన నిలువురాళ్లను సందర్శించి వీటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని డీఈఓ డా. గోవిందరాజు సూచించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ కిషోర్‌కుమార్‌, ఎంఈఓ నిజాముద్దీన్‌, సర్పంచ్‌ బాలరాజు, మురహర్‌దొడ్డి సర్పంచ్‌ నర్సమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement