పరీక్షలకు పక్కా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

Feb 25 2026 7:13 AM | Updated on Feb 25 2026 7:13 AM

పరీక్

పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

నారాయణపేట రూరల్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానుండగా.. నిర్వహణకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సమయసారిణి ప్రకారం కొనసాగేలా డీఐఈఓ కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

9 స్టాక్‌ పాయింట్లు..

జిల్లాలో 45 జూనియర్‌ కళాశాలలు ఉండగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,783 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నారాయణపేటలో 4, మక్తల్‌లో 3, కోస్గి, ధన్వాడలో 2, మద్దూర్‌, దామరగిద్ద, ఊట్కూర్‌, మాగనూర్‌, మరికల్‌లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలను 9 స్టాక్‌ పాయింట్లలో భద్రపర్చారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగనుండగా.. నిర్వహణకు రెండు రకాల కమిటీలు పని చేయనున్నాయి. హై పవర్‌ కమిటీలో చైర్మన్లుగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ వినిత్‌, కన్వీనర్‌గా డీఐఈఓ సుదర్శన్‌రావు ఉండగా.. డీఈసీ కమిటీలో ఇంటర్‌ నోడల్‌ అధికారితో పాటు సీనియర్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, అధ్యాపకుడు పి.నర్సింహారెడ్డి ఉన్నారు. స్ట్రాంగ్‌ రూం ఇన్‌చార్జ్‌గా ఆర్‌.రవీందర్‌తో పాటు నారాయణపేట, మక్తల్‌లో కస్టోడియన్లుగా విజయలక్ష్మి, దత్తాత్రిరావు వ్యవహరిస్తున్నారు.

సిబ్బంది కేటాయింపు..

పరీక్షల నిర్వహణకు 15 మంది సీఎస్‌లు, నలుగురు అడిషనల్‌ సీఎస్‌లు, 15 మంది డీఓలు, ఇద్దరు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్‌, మరో సిట్టింగ్‌ స్కాడ్‌ బృందం ఏర్పాటు చేశారు. 11 చోట్ల ప్రభుత్వ కళాశాలలు, 4 చోట్ల ప్రైవేట్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉండటంతో అడిషనల్‌ సీఎస్‌ల నియామకం చేశారు. ఇక 230 మంది ఇన్విజిలేటర్లుగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కళాశాల సిబ్బందిని తీసుకోగా.. తక్కువగా ఉన్నచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.

9.05 వరకు అనుమతి..

గతంలో అమలు చేసిన ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయం ఉదయం 9 గంటలకు కాగా.. ఐదు నిమిషాల గ్రేస్‌ టైం కలుపుకొని 9.05 వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదు. ఇంటర్‌నెట్‌లో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షకు వెళ్లే అవకాశం ఉంది.

నేటి నుంచి ఇంటర్‌ ఎగ్జామ్స్‌

జిల్లాలో 15 కేంద్రాలు.. 8,192 మంది విద్యార్థులు

హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకంతప్పనిసరి కాదు

ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిమిషాల వరకు అనుమతి

పరీక్షలకు పక్కా ఏర్పాట్లు 1
1/1

పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement