‘పీఎంశ్రీ’తో పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన
● నీతి ఆయోగ్ అడిషనల్ డైరెక్టర్‌గౌరవ్ కటియార్
నర్వ: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎంశ్రీ నిధులతో పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని నీతి ఆయోగ్ అడిషన్‌ల్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ అన్నారు. ఆస్పిరేషన్ బ్లాక్‌గా ఎంపికై న నర్వ మండలంలో మంగళవారం ఆయన పర్యటించి ఏడాదిగా చేపట్టిన పనులను స్వయంగా పరిశీలించారు. పెద్దకడ్మూర్ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులు, ఏఎక్స్‌ఎల్ బోధన, సైన్స్‌ల్యాబ్, అధునాతన సైన్స్ పరికరాలు, డిజిటల్ క్లాస్‌రూంను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల వేసిన యోగాసనాలు చూసి అభినందించారు. పాఠశాల ఆవరణలో నాటిన ఔషద మొక్కలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకొని ఒక మొక్క నాటారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మహిళా సమాఖ్య భవనంలో స్కూల్ యూనిఫామ్స్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి సభ్యులతో మాట్లాడి వస్తున్న ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రాయికోడ్ మోడల్ అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకొని చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అలాగే గర్భిణులకు సీమంతాలు చేసి వస్త్రాలు అందించారు. వారికి అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్నారు. అనంతరం పాతర్చేడ్‌లో కొనసాగుతున్న పశు వైద్య శిభిరంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఆయన వెంట శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీఆర్డీఓ మొగులయ్య, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి, యాస్పిరేషన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ బాలాజీ, సీడీపీఓ సరోజిని, పెద్దకడ్మూర్ సర్పంచ్ నాయిని గోవింద్, జీహెచ్‌ఎం భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


