పకడ్బందీగా పది, ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పది, ఇంటర్‌ పరీక్షలు

Feb 25 2026 7:13 AM | Updated on Feb 25 2026 7:13 AM

పకడ్బందీగా పది, ఇంటర్‌ పరీక్షలు

పకడ్బందీగా పది, ఇంటర్‌ పరీక్షలు

నారాయణపేట: జిల్లాలో ఇంటర్మీడియట్‌, పదోతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌ పాల్గొని వివరా లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు విద్య, వైద్య, పోలీసు తదితర శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌, చీటింగ్‌, మాల్‌ప్రాక్టీస్‌, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇంటర్‌ పరీక్షల కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 8,192 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. అలాగే పదోతరగతి పరీక్షలకు 8,318 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. 43 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో వైద్యసిబ్బంది ద్వారా హెల్త్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని స్పష్టం చేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సిట్టింగ్‌ స్క్వాడ్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేసి చీటింగ్‌ జరగకుండా చూడాలని సూచించారు. అన్ని కేంద్రాల ఆవరణలో బీఎన్‌ఎస్‌ 163, 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను పోలీస్‌ పహారాలో కేంద్రాలకు తరలించి, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపర్చాలని సూచించారు. ప్రశ్నాపత్రాల కవర్లను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మాత్రమే సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరవాలని.. కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను పరీక్షల సమయంలో మూసి ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని.. ప్రతి కేంద్రంలో విద్యార్థులు తెచ్చిన పుస్తకాలు, బ్యాగులు, ఇతర వస్తువులు భద్రపర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, ఎస్పీ డా. వినీత్‌ ఆర్డీఓ రాంచందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement