ఎట్లైనా పోరుబాట..! | - | Sakshi
Sakshi News home page

ఎట్లైనా పోరుబాట..!

Jan 30 2026 6:12 AM | Updated on Jan 30 2026 6:12 AM

ఎట్లైనా పోరుబాట..!

ఎట్లైనా పోరుబాట..!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్‌పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్‌–ఏ లేదంటే ప్లాన్‌–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

బీజేపీవైపు చూపు..

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్‌ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్‌ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిలువరించేందుకేనా..

అధికార కాంగ్రెస్‌లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్‌ కాదు, కొత్త కాంగ్రెస్‌.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్‌ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్‌గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్‌ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నారాయణపేటలో కాంగ్రెస్‌, ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్‌, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ అభ్యర్థులను ప్రకటించనున్నాయి.

కొన్ని ఉదాహరణలు..

కాంగ్రెస్‌కు సంబంధించి మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్‌ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్‌లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్‌లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్‌కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్‌లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది.

కార్పొరేషన్‌లోని 52వ డివిజన్‌కు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకుడైన మాజీ కౌన్సిలర్‌ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్‌ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది.

భారీగా ఆశావహులతో అనిశ్చితి..

తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో కార్పొరేటర్‌ పదవుల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్‌ రెండు పర్యాయాలు, బీఆర్‌ఎస్‌ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్‌ఎస్‌లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్‌ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్‌ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement