పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పార దర్శకంగా నిర్వహించాలని.. ముఖ్యంగా చెల్లని ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ముగిసిన తర్వాత భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను అన్ సీల్ చేసి.. కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే విషయాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కౌంటింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు.
సందేహాలు నివృత్తి చేసుకోవాలి
కోస్గి రూరల్: ఎన్నికల అధికారులకు తలెత్తే సందేహాలను విధిగా నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోస్గి మున్సిపల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓలకు పలు సూచనలు చేశారు. నారమినేషన్ పత్రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే వారి వాహనాలను కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే నిలిపివేసేలా పోలీసుల భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆభ్యర్థి వెంట సాక్షి, ప్రతిపాదకుడిని మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ సైదులు, డీటీ కరుణాకర్ ఉన్నారు.


