జిల్లాలో 4 చెక్‌పోస్టుల ఏర్పాటు: ఎస్పీ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ డా.వినీత్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల తరలింపును అరికట్టేందుకు 4 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాటిలో రెండు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, రెండు జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయన్నారు. అదే విధంగా 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో 4 ఎఫ్‌ఎస్‌టీ ఫ్లయింగ్ స్క్వాడ్, 4 స్టాటటిక్ సర్వేలెన్స్ టీంలు చెక్‌పోస్టుల వద్ద, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు అందరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మక్తల్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ అన్నారు. మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కౌంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలను శాంతియుతంగా, స్చేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే పోలీస్‌శాఖ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 163 బిఎన్‌ఆర్‌ఎస్‌ఎస్, 144 సీఆర్‌పీసీ అమలులో ఉంటుందని.. నిబంధనల మేరకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, ఎస్‌బీ ఎస్‌ఐ నరేశ్, నవీద్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు తదితరులు ఉన్నారు.


