వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాయితీపై పరికరాలు
జిల్లాకు 310 యూనిట్లు, రూ.73.85 లక్షలు మంజూరు
24న ఉత్తర్వులు జారీ.. 26 వరకే దరఖాస్తుకు అవకాశం
కేవలం రెండు రోజులే గడువుతోఇబ్బందులు
జిల్లాలో కేవలం 132 దరఖాస్తులస్వీకరణ
గడువు పెంచి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని వినతులు
కోస్గి: రైతులకు సాగులో ఎంతో అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయం ఇవ్వడంతో అర్హులైన రైతులు ఎంతోమంది పథకానికి దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం పడుతుండడంతో ఇక రెండు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక.. అందులోనూ కేవలం మహిళా రైతులే అర్హులని తెలపడంతో అయోమయంలో పడ్డారు. గడువు పెంచి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
రెండు రోజులు.. 132 దరఖాస్తులు
ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు మంజూరు చేసింది. ఈ నెల 24న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దశాబ్ద కాలంపాటు ఆగిన ఈ యాంత్రీకరణ పథకం మళ్లీ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఉండటంతో భూములున్నప్పటికీ మహిళల పేరుతో భూమి లేకపోవడంతో అర్హులైన చిన్నకారు, సన్నకారు రైతులు సైతం ఈ పథకానికి దూరమవుతున్నారు. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 132 మంది దరఖాస్తు చేసుకున్నారు.
నిబంధనలతో ఇబ్బందులు..
ట్రాక్టర్‌కు సంబంధించిన యంత్రాలు ఇచ్చేందుకు భూమి మహిళల పేరుతో ఉండాలని, ట్రాక్టర్ ఆర్‌సీ మహిళల పేరుతో ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభు త్వం నిబంధనలు కొంతమేర సడలిస్తూ దరఖాస్తు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్యవసాయశాఖలో యాంత్రీకరణ పథ కాన్ని నిలిపేసింది. దీంతో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి జిల్లాల వారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని 13 మండలాలకు సంబందించి 310 యూనిట్లు కేటాయించి, రూ.73.85 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో వ్యవసాయశాఖ అధికారులు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే వివిధ కంపెనీలకు చెందిన తయారీదారులు సంబంధిత పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. సబ్ మిషన్ ఆఫ్ ఫామ్ మెకలైజేషన్ పథకం కింద ఎంపికై న రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది.


